ప్రజాస్వామ్యంలో న్యాయానికి పొద్దుగుంకడమంటూ వుండదని, చిరకాలంగా అన్యాయం జరుగుతున్నదని తాను భావిస్తే తన వొరలోంచి సునిశిత ఖడ్గాన్ని తీసి దానిని తెగనరికే అధికారం తనకున్నదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరొకసారి చాటి చెప్పింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న ఎజి పేరరివాలన్‌కు స్వేచ్ఛ ప్రసాదిస్తూ న్యాయమూర్తి లావు నాగేశ్వర రావు అధ్యతన గల సుప్రీం ధర్మాసనం బుధవారం నాడు ఇచ్చిన తీర్పు భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో విశేష ఘట్టంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇటువంటి కేసుల్లో క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్లకు, రాష్ట్రపతికి మాత్రమే వుంటుంది. అటు వైపు నుంచి ఎప్పటికీ చొరవ కనిపించకపోడంతో సుప్రీం ధర్మాసనం తన వద్ద గల 142వ అధికరణను ప్రయోగించి ఇతని విడుదలకు ఆదేశించింది. క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ పేరరివాలన్ చేసుకున్న విజ్ఞప్తిపై గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా విపరీత జాప్యం చేసినందున తనకున్న ప్రత్యేకాధికారాలతో ఆయన విడుదలకు ఆదేశిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
క్షమాభిక్ష అభ్యర్థనపై తనకున్న అధికారాల కింద స్వయంగా నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపించడం సబబు కాదని కూడా అభిప్రాయపడింది. పేరరివాలన్ తదితర దోషులకు క్షమాభిక్ష పెట్టవలసిందిగా తమిళనాడు మంత్రివర్గం 2014 ఫిబ్రవరిలోనే సిఫారసు చేసినప్పటికీ గవర్నర్ రాజ్యాంగం 161 అధికరణ కింద తనకున్న ప్రత్యేకాధికారాలను వినియోగించకుండా వల్లమాలిన ఆలస్యం చేశారని భావించింది. ఇటువంటి కేసుల్లో క్షమాభిక్ష పెట్టే అధికారం భారత శిక్షాస్మృతి 302 (హత్య) కింద కేవలం రాష్ట్రపతికే వుంది గాని గవర్నర్‌కు లేదని కేంద్ర ప్రభుత్వం వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. వాస్తవానికి ఈ కేసులో పేరరివాలన్, మురుగన్ , శంతన్ అనే ముగ్గురు దోషులకు 2011 ఆగస్టులోనే ఉరి శిక్ష అమలై వుండవలసింది. కాని వారి క్షమాభిక్ష అభ్యర్థనలపై నిర్ణయం ఆలస్యమైనందున అది అమలు కాలేదు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగిన 1991 నాటికి పేరరివాలన్ 19 ఏళ్ల యువకుడు. శ్రీలంకలోని తమిళుల హక్కుల కోసం సుదీర్ఘ హింసాయుత పోరాటాన్ని సాగించిన తమిళ ఈలమ్ లిబరేషన్ టైగర్ల (ఎల్‌టిటిఇ) సానుభూతిపరుడు. తమను అణచివేయడానికి శ్రీలంకకు భారత శాంతి పరిరక్షక దళాలు పంపినందున ఎల్‌టిటిఇ పగబట్టి రాజీవ్ గాంధీని హతమార్చింది. ఎల్‌టిటిఇ బృందం చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో ఆత్మాహుతి బాంబును పేల్చడానికి ఉపయోగించిన బ్యాటరీని సమకూర్చడంలో తోడ్పడ్డాడన్న అభియోగంపై పేరరివాలన్‌కు శిక్ష పడింది. యవ్వనం మొదలుకొని జీవితమంతా జైల్లో గడిపిన ఈయన నేరానికి సంబంధించి సిబిఐ తన అభిప్రాయాన్ని ఒక దశలో సవరించుకున్నది. అతనిని విడుదల చేయదలచుకుంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని 2020 నవంబర్‌లో తెలియజేసింది. రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21న జరిగింది. రాజీవ్ గాంధీ, ఆత్మాహుతి బాంబుగా ఉపయోగపడిన ధను మరి 14 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో పలువురు పోలీసు అధికార్లు కూడా వున్నారు. కీలక హంతకులు శివరాసన్, నళిని, శుభ. శివరాసన్ , శుభ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో మరణ శిక్షలు విధించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి (ప్రస్తుతం మాజీ) జస్టిస్ కెటి థామస్ మిగిలిన దోషులను కూడా విడుదల చేయాలని తాజాగా విజ్ఞప్తి చేశారు.
వాస్తవానికి ఆయన 2017 నుంచే వీరి విడుదలను కోరుతున్నారు. రాజ్యాంగం 142 అధికరణ కింద పేరరివాలన్ విడుదల సమంజసమైన చర్య అని థామస్ అభిప్రాయపడ్డారు. చట్టప్రకారం 14 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత జైలు కమిటీ సిఫారసు మేరకు ఆ మరణ శిక్షపై సమీక్ష జరుపవచ్చని ఆయన అన్నారు. ఈ కేసులో జైల్లో వున్న ఇతర దోషులను కూడా విడుదల చేయాలని ఆయన సూచించారు. నళిని, ఆమె భర్త శంతన్, జయ కుమార్, రవిచంద్రన్, రాబర్ట్ ప్యాస్ అనే దోషులు ఇంకా జైల్లో వున్నారు. పేరరివాలన్ మాదిరిగానే వీరికి కూడా క్షమాభిక్ష పెట్టడం న్యాయమవుతుంది. మార్పు సహజం. ఎంతటి దుర్మార్గమైన అపరాధానికి పాల్పడిన వారైనా మారడానికి అవకాశం వుంది. జైళ్లున్నదే దోషులలో మార్పు తేడానికి, వారిలో మంచి ఆలోచన కలిగించడానికి.
ఇన్నేళ్ల శిక్షల తర్వాత వారిలో మంచితనం అంకురించలేదని అనుకోడం పొరపాటు. అంతేగాక పగ, ద్వేషం వెనుక సామాజిక, చారిత్రక కారణాలున్నప్పుడు వాటిని విశాల దృష్టితో చూడవలసిన అవసరం కూడా వుంటుంది. ప్రజాస్వామిక ధర్మ న్యాయ స్థాపనకు సుప్రీంకోర్టు తన వద్ద గల 142 అధికరణను ప్రయోగించవలసిన అవసరం మున్ముందు మరింతగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి.