Wednesday, January 22, 2025

తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీం కోర్టులో మరోసారి ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీం కోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆమె మధ్యంతర బెయిల్‌ను న్యాయస్థానం పొడిగించింది. జులై 19 వరకు అరెస్టు నుంచి వెసులుబాటు కల్పించింది. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెపై గతంలో కేసు నమోదైంది. అమాయకులను కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ ఆమెపై పోలీస్‌లు అభియోగాలు మోపారు.

ఆ కేసులో భాగంగా గతంలో గుజరాత్ యాంటీ టెర్రర్ స్కాడ్ (ఏటీఎస్ ) ముంబైలో తీస్తాను అదుపు లోకి తీసుకుంది. ఆ తర్వాత ఆమె రెండు నెలలపాటు జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తీస్తా సెతల్వాడ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై గత సెప్టెంబర్‌లో ఆమెకు ఊరట లభించింది. అప్పటినుంచి ఆమె మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు.

అయితే ఆమె సాధారణ బెయిల్ కోసం కొద్ది రోజుల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో పాటు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలో ఆమెకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏడు రోజుల పాటు సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే విధించింది. తాజాగా మధ్యంతర బెయిల్‌ను జులై 19 వరకు పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News