Monday, December 23, 2024

ఢిల్లీ ఎల్‌జి అధికారాలకు కత్తెర

- Advertisement -
- Advertisement -

పూర్వకాలంలో రాజ్యాల మధ్యన, ఇప్పుడు కొన్ని దేశాల మధ్యన, అధికారం కోసం దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గమనిస్తే అదే తరహాలో భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంపై తనదే అధికారం అని స్వయంగా ఎనిమిదేళ్ల క్రితం నోటిఫికేషన్ జారీ చేసుకోవడాన్ని ఒకరకంగా దాడిగానే చూడవలసి ఉంటుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్యన కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు ప్రపంచ దేశాలు నైతిక మద్దతు ప్రకటిస్తుంటే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రజల మద్దతుతో నైతిక విజయాన్ని సాధించినట్లుగానే, ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ నాయకత్వంలో సుప్రీంకోర్టు చొరవతో అధికారం తమదేనని తేల్చి చెప్పడంతో హర్షానికి అంతులేకుండాపోయింది.

అదే పనిగా వడివడిగా చర్యలు తీసుకోవడం కూడా ప్రారంభం కావడం కేంద్రానికి కునుకు లేకుండా చేస్తున్నది.ఢిల్లీ రాష్ట్ర పరిపాలనా సర్వీసులపైన అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయని 2015లో కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా కాకుండా ఢిల్లీకి దేశ రాజధాని హోదా కల్పించడం వలన తమదే అధికారమని తేల్చిచెప్పింది. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆప్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2019 ఫిబ్రవరి 14వ తేదీన ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనవి.

దీనితో కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఈ కేసును 2022 మే 6న బదిలీ చేయగా సంవత్సరం పాటు కొనసాగిన విచారణ అనంతరం తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ అశోక భూషణ్ ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు అన్న తీర్పును త్రోసిపుచ్చుతూ ఈ తీర్పు వెలువడినది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 11 మే 2023 రోజున వెలువరించిన తీర్పులో ఢిల్లీ శాంతి భద్రతలు, పోలీస్ శాఖ, భూమి మినహా మిగిలిన పరిపాలన వ్యవహారాలపై పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానివే అని చెప్పడంతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఊరట లభించింది.

ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని అంతిమంగా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికే అధికార యంత్రాంగంపై నియంత్రణ ఉంటుందని చెప్పి కేంద్రం అధికార దాహంపై కొరడా ఝలిపించింది. అధికారులు మంత్రుల ఆదేశాలను పాటించకపోతే ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని, లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం వల్ల పాలన మరింత గాడి తప్పుతుందని సుప్రీం తీర్పు ద్వారా మనకు స్పష్టం అవుతున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండడం వలన పరిపాలనపై అధికారాలు ప్రజాప్రతినిధితో కూడిన స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా పాలన విఫలం కాకుండా చూడాలని సూచించడం కేంద్రం అధికార దాహానికి తిలోదకాలు ఇవ్వడమే అవుతుంది.

ప్రభుత్వం రోజువారీగా తీసుకునే నిర్ణయాలను అమలు చేయడానికి మంత్రుల పరిపాలనా నియంత్రణ కింద అధికారులు పని చేయాలని సివిల్ సర్వీసు అధికారులు రాజకీయంగా తటస్థంగా వ్యవహరించాలని చేసిన సూచన అధికారులు పాలకులకు తొత్తులుగా వ్యవహరించకూడదని చేసిన మరొక గొప్ప అంశంగా చూడవచ్చు. సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపైన ఇచ్చిన తీర్పు పట్ల సిఎం కేజ్రీవాల్ స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. చిత్తశుద్ధి ఉన్నప్పటికీ అధికారాలు లేకపోవడం తో అభివృద్ధి నత్తనడక నడిచిందని, ఇకపై ఢిల్లీలో అభివృద్ధిని వేగవంతం చేసి చూపిస్తామని, సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు ప్రకటించడం ఇంత వరకు కేంద్రం ఒత్తిడి వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ విద్య, వైద్య రంగాలలో ఢిల్లీ ప్రభుత్వం భారతదేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న విధానాన్ని ఆలోచిస్తే పాలన ఇకనుండి మరింత వేగవంతంగా ముందుకు వెళ్తుందని ఆశించవచ్చు.

తీర్పు వెలుబడినదో లేదో ముఖ్యమంత్రి తన కార్యాచరణను ప్రకటిస్తూ నిర్లక్ష్యంగా ప్రజల సమస్యల పట్ల వ్యవహరించిన అధికారులపై కొరడా ఝుళిపించడానికి చేసిన హెచ్చరిక ఇన్నాళ్లుగా తన చేతులకు సంకెళ్లు ఉన్నాయని విస్తృత అధికారాలతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడానికి ఈ తీర్పు ఉపయోగపడుతుందని చేసిన ప్రకటన ఇతర రాష్ట్రాలకు, గవర్నర్ వ్యవస్థ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాలకులకు, నిబద్ధత కలిగిన ప్రభుత్వాలకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

సుప్రీంకోర్టు కనుక చొరవ తీసుకోకపోతే, అది కూడా విస్తృత ధర్మాసనానికి ఇవ్వకపోతే తీర్పు మరోలా ఉండేది. అయితే నిబద్ధత, రాజ్యాంగ విలువలపట్ల అవగాహన, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ధిక్కరించగలిగిన ఆత్మస్థైర్యం, నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే దృక్పథం గలిగిన సిజెఐ నాయకత్వంలోని విస్తృత ధర్మాసనం లోతుగా ఆలోచించడం వలన ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతున్నదని అర్థం చేసుకోవడం వలన మాత్రమే ఈ తీర్పు వెలువడినది. అంటే న్యాయస్థానాల వలన గాడి తప్పిన పాలనకు మెరుగులుదిద్దవచ్చునని, సవరించవచ్చునని ఈ తీర్పు ద్వారా తెలుస్తున్నది. 100% కాకపోయినా కొంతవరకైనా న్యాయవ్యవస్థ ద్వారా అవినీతి, అన్యాయమైనటువంటి పద్ధతులను ఎదుర్కోవడానికి అవకాశం ఉన్నదని చెప్పడానికి ఈ తీర్పు మచ్చుతునకగా పని చేస్తుంది.

వడ్డేపల్లి మల్లేశము
9014206412

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News