న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు సత్యేంద్ర జైన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. సత్యేంద్ర జైన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరఫ/న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు వాదనలు విన్న అనంతరం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకల్ మిటల్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సత్యేంద్ర జైన్‌కు ఆరోగ్య కారణణాలపై జనవరి 8వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ 2023 డిసెంబర్ 14న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
2023 మే 26న జైన్‌కు ఆరోగ్య కారణాలపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడూ బెయిల్‌ను పొడిగిస్తూ వస్తోంది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తనకు సంబంధించిన నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ 2022 మే 30న జైన్‌ను ఇడి అరెస్టు చేసింది. 2017లో అవినీతి నిరోధక చట్టం కింద సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా జైన్‌ను ఇడి అరెస్టు చేసింది. సిబిఐ నమోదు చేసిన కేసులో 2019 సెప్టెంబర్ 6న జైన్‌కు ప్రత్యేక కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.