న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రా తదితరులతో కూడిన ధర్మాసనం నాలుగు పిటిషన్లపై మూడు రోజుల పాటు విచారించి తీర్పును రిజర్వు చేసింది. 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన నిధుల వివరాలను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ పథకం 2018 జనవరి 2న అమలు లోకి వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
2024 సార్వత్రిక ఎన్నికల కోసం బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని అక్టోబర్ 10న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పరిగణన లోకి తీసుకుంది. దీంతో అక్టోబర్ 31 న వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ పథకం ప్రకారం దేశం లోని ఏ పౌరుడైనా, ఏ వ్యవస్థ అయినా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద నమోదైన రాజకీయ పార్టీలు, గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఒక శాతం కన్నా తక్కువ కాకుండా ఓట్లు సంపాదించిన పార్టీలు మాత్రమే ఎలెక్టోరల్ బాండ్లు స్వీకరించడానికి అర్హత కలిగి ఉంటాయి. 2019 ఏప్రిల్‌లో ఈ పథకాన్ని నిలిపివేయడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. అయితే దీనిపై వచ్చిన పిటిషన్లపై సమగ్రంగా విచారించడానికి నిర్ణయించింది