Wednesday, January 22, 2025

త్రిసభ్య కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషన్ నియామకాలను ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సిజెఐ సభ్యులుగా ఉండే కమిటీయే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులమేరకు కేంద్ర ప్రధాన ఎ న్నికల కమిషనర్ (సిఇసి), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రప తి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం 5 0 మెజారిటీతో ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషీకేశ్ రాయ్, సిటి రవికుమార్‌లు ధర్మాసనంలోని మిగతా సభ్యులు. సిఇసి, ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొలీజియం లాంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలయిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై వాదనలను విన్న ధర్మాసనం గత ఏడాది నవంబర్ 24న తీర్పు రిజర్వ్ చేసింది.
ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్రస్తుతమున్న విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వీరి నియామకాల కోసం పార్లమెంటు కొత్త చట్టం తీసుకువచ్చేంతవరకు త్రిసభ్య కమిటీ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజారిటీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది.అయితే ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ సిఇసి తొలగింపు వలె ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఇసిల నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని పేర్కొంది. స్వచ్ఛమైన ఎన్నికలను నిర్వహించడమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లక్షమని తెలిపింది. పారదర్శకత లేకపోతే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది. రాజ్యాంగ పరిధిలోనే ఎన్నికల కమిషన్ పని చేయాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించింది.
చరిత్రాత్మక తీర్పు: విపక్షాలు
సిఇసి, ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఇది చరిత్రాత్మకమైన తీర్పు అని, దేశంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు జరగడానికి బాట వేస్తుందని పేర్కొన్నాయి.‘ఎన్నికల కమిషన్‌పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాం. ఇసిని ప్రభుత్వ ప్రభావంనుంచి, దానిపై ఆధారపడడంనుంచి కాపాడడం వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రత కాపాడబడుతుంది. పూర్తిగా స్వతంత్రమైన ఎన్నికల కమిషన్ మాత్రమే స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలను నిర్వహించాలన్న దాని బాధ్యతను నెరవేర్చగలుగుతుంది’ అని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ట్విట్టర్‌లో అన్నారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి విజయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆమ్ ఆద్మీపార్టీ నేత సంజయ్ సింగ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక చరిత్రాత్మక తీర్పు అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది అభిప్రాయపడ్డారు.
నిపుణుల భిన్నాభిప్రాయాలు
కాగా సుప్రీంకోర్టు తీర్పుపై నిపుణులు మాత్రం రెండుగా విడిపోయారు. కొంతమంది తీర్పును స్వాగతించగా, మరికొందరుమాత్రం కార్యనిర్వాహక, చట్టసభల పరిధిలోకి ప్రవేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని అభిప్రాయపడ్డారు. ఇది అద్భుతమైన తీర్పని గతంలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన ఎస్‌వై ఖురేషి అభిప్రాయపడ్డారు. అయితే ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు చట్టాన్ని చేసిందని, అది దాని పని కాదని, పార్లమెంటుదని కేంద్ర న్యాయశాఖమాజీ కార్యదర్శి పికె మల్హోత్రా అన్నారు. కాగా గతంలో పాటిస్తున్న దానికి ఇది భిన్నమైనదని, అందువల్ల ఇది స్వాగతించదగ్గది లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు పిడిటి ఆచారి అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఇతర ఏజన్సీలు వేటినీ సంప్రదించకుండా ప్రభుత్వం తానే ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించేదని, అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకునే ప్రక్రియలో లెజిస్లేచర్, జ్యుడీషియరీ రెండూ భాగస్వాములుగా ఉంటాయని, ఇది చాలా ముఖ్యమైన పరిణామమమని ఆయన అన్నారు. ఆ మేరకు ఇది చాలా మంచిదన్నారు. అయితే అప్పుడు జడ్జీలను నియమించే వ్యవస్థకు ప్రధానమంత్రి నేతృత్వం వహించాలని పేరు వెల్లడించానికి ఇష్టపడని మరో మాజీ సిఇసి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News