Tuesday, September 17, 2024

రాబడి లేనప్పుడు జీతాలు సమస్యే.. చిన్న కంపెనీలపై చర్యలొద్దు: సుప్రీం

- Advertisement -
- Advertisement -

Supreme court says Don't take action on small Industries

 

న్యూఢిల్లీ : కరోనా దశలో పూర్తి స్థాయి వేతనాలు చెల్లించని చిన్న పరిశ్రమలపై బలవంతపు కఠిన చర్యలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. వచ్చే వారం వరకూ ఆయా కంపెనీలపై ఎటువంటి చట్టపరమైన చర్యలకు దిగవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. లాక్‌డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిన చిన్న పరిశ్రమలలో ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు అరకొరగానే అందాయి. ఈ నెల 29వ తేదీన కేంద్ర హోం మంత్రిత్వశాఖ కంపెనీలకు సర్కులర్ వెలువరించింది. ఇందులో కార్మికులకు అందరికీ పూర్తి స్థాయి వేతనాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఎంఎస్‌ఎంఇలతో కూడిన చేతి పనిముట్ల ఉత్పత్తి సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయమూర్తులు ఎల్‌ఎన్ రావు, ఎస్‌కె కౌల్, బిఆర్ గవాయితో కూడిన ధర్మాసనం స్పందించింది. ఇది కాకుండా సంబంధిత అంశంపైనే దాఖలైన పలు పిటిషన్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించింది.

ప్రస్తుత లాక్‌డౌన్ దశలో చిన్న పరిశ్రమలకు ఉత్పత్తి లేకపోవడంతో తలెత్తిన రాబడి నష్టం వల్ల వేతనాలు పూర్తి స్థాయిలో చెల్లింపులు లేవని భావించాల్సి వస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ముక్కుపిండి వసూళ్లకు దిగడం కుదరదని తెలిపారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ప్రస్తుత అంశంపై తాము కాన్ఫరెన్స్ జరిపినట్లు, అన్నింటిని పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయి నివేదిక అందిస్తామని కోర్టుకు తెలిపారు. దీనితో వచ్చే వారం వరకూ కంపెనీలపై ఎటువంటి చర్యలకు దిగవద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కార్మికులకు జీతాలు ఇవ్వాలి, అయితే పరిశ్రమలకు సరైన రాబడి లేదని, ఈ దశలో మౌలిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News