వైద్య కోర్సులలో సీట్లు ఖాళీగా ఉండిపోరాదని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. రాష్ట్రాలతో సహా సంబంధిత సంస్థలో సమావేశం నిర్వహించాలని, ఈ అంశంపై నియమించిన కమిటీ సిఫార్సులను పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరింది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ నిర్వహిస్తూ, ‘సీట్లు ఖాళీగా ఉండిపోకూడదు’ అని వ్యాఖ్యానించింది. వైద్య కోర్సులలో సూపర్ స్పెషాలిటీ సీట్లు ఖాళీగా ఉండిపోతున్న అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం 2023 ఏప్రిల్‌లో ప్రస్తావించింది.
ఈ సమస్య పరిష్కారానికి ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్‌జనరల్ సారథ్యంలో రాష్ట్రాలు, ప్రైవేట్ వైద్య కళాశాలల ప్రతినిధులతో సహా సంబంధిత వ్యక్తులు అందరితో ఒక కమిటీని నియమించాలని కేంద్రం అప్పట్లో ప్రతిపాదించింది. సంబంధిత వ్యక్తులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు, కమిటీ ఈ అంశంపై తన సిఫార్సులు అందజేసినట్లు కేంద్రం న్యాయవాది శుక్రవారం వెల్లడించారు. కేంద్రం సంబంధిత వ్యక్తులతో సమావేశం నిర్వహించి, పటిష్ఠమైన ప్రతిపాదనతో వస్తే సముచితంగా ఉంటుందని న్యాయవాది సూచించారు.
దానితో కేంద్రం అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బెంచ్ ఆదేశించింది. అవసరమైన చర్యలను మూడు నెలల్లోగా తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించి, ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్‌లో నిర్వహిస్తామని తెలియజేసింది. విలువైన 1003 సూపర్ స్పెషాలిటీ సీట్లకు అడ్మిషన్లు ఏవీ జరగనందున అవి వ్యర్థం అవుతుండడం ‘అత్యంత శోచనీయం’ అని సర్వోన్నత న్యాయస్థానం 2023 ఏప్రిల్‌లో వ్యాఖ్యానించింద. ‘ఒక వైపు సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరతను ఎప్పుడూ ఎదుర్కొంటున్నాం, మరొక వైపు ఆ విలువైన సీట్లు భర్తీ కాకుండా ఉండిపోతున్నాయి’ అని కోర్టు పేర్కొన్నది.