నీట్ యుజి పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదు
2 సెంటర్లలో మాత్రమే పేపర్ లీకేజీ జరిగింది
మళ్లీ పరీక్షకు ఆదేశిస్తే విద్యార్థులపై తీవ్ర ప్రభావం
వ్యవస్థీకృత అక్రమాలు జరిగినట్లు ౩ధారాలు లేవు
నీట్‌పై పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన నీట్-యుజి 2024 పరీక్షను రద్దు చేయాలని, మళ్లీ పరీక్షను నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అక్రమాలు విస్తృత స్థాయిలో జరిగాయనడానికి ఆధారాలు ఏవీ లేవని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. నీట్ పరీక్ష పవిత్రతకు కళంకం ఏర్పడిందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని, ప్రశ్నాపత్రం లీకేజీ కేవంల రెండు కేంద్రాలకే పరిమితమైందని ధర్మాసనం తెలిపింది. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవస్థీకృతంగా జరగలేదని, అలా జరిగి ఉంటే నీట్ పరీక్ష పవిత్రకు నాశనం అయి ఉండేదని ధర్మాసనం తెలిపింది.
మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తే 23.33 లక్షల మంది విద్యార్థులు వీరిలో అనేకులు తమ స్వంత ఊళ్ల నుంచి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని, దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. మళ్లీ పరీక్షకు ఆదేశిస్తే అది విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, అడ్మిషన్ షెడ్యూల్ దెబ్బతినడంతోపాటు వైద్య విద్యపైన, భిష్యత్తులో వైద్యుల లభ్యతపైన కూడా దీని ప్రభావం ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఇది అణగారిని వర్గాలకు చెందిన విద్యార్థుల ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. 20 లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టి లో ఉంచుకుని తీర్పు సారాంశాన్ని వెలువరించిన ధర్మాసనం తీర్పు పూర్తి పాఠాన్ని తర్వాత వెలువరిస్తామని పేర్కొంది. నీట్-యుజి 2024 పరీక్షా ఫలితాలలో లోపాలు కాని వ్యవస్థాపరంగా తప్పులు జరిగినట్లు కాని ఆధారాలు ఏవీ లేవని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. అయితే హజారీబాగ్, పాట్నాలో ప్రశ్నాపత్రం లీకేజీజరిగిన మాట వాస్తవమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు నరేంద్ హూడా, సంజయ్ హెగ్డే, మాథ్యూస్ నెడుమాప్రతోసహా అనేక మంది న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మే 5న నిర్వహించిన నీట్ యుజి పరీక్షలో పేపర్ లీకేజీతోపాటు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని విద్యార్థులతోపాటు ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, ఇతర వైద్య కోర్సులలో ప్రవేశాల కోసం నీట్ యుజి పరీక్షను ఎన్‌టిఎ నిర్వహిస్తుంది. మే 5న జరిగిన నీట్ యుజి 2024 పరీక్షను 14 విదేశీ నగరాలతోసహా 571 నగరాలలోని 4,750 కేంద్రాలలో నిర్వహించగా 23.33 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.