Sunday, December 22, 2024

కోల్‌కతా పోలీసుల తీరుపై సుప్రీం సీిరియస్

- Advertisement -
- Advertisement -

ఆర్‌జి కర్ ఆసుపత్రి ఘటనపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం
30 ఏళ్లలో ఇటువంటి దర్యాప్తు చూడలేదు న్యాయమూర్తి
పార్థీవాలా తీవ్ర స్పందన.. కోర్టుకు సిబిఐ స్టేటస్ రిపోర్టు
నేర స్థలిని మార్చారు, కేసు రికార్డులో జాప్యం చేసినట్లు నివేదిక

న్యూఢిల్లీ : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో లేడీడాక్టరు పై హత్యాచారం ఘటన పట్ల కోల్‌కతా పోలీసు తీరును సుప్రీంకోర్టు గురువారం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ఘటనపై సిబిఐ ఇంతవరకూ జరిపిన దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశాల ప్రాతిపదికన స్థానిక పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చే శారు. 31 ఏండ్ల మహిళ డాక్టరు విధుల్లో ఉన్నప్పుడు అత్యంత దారుణ రీతిలో రేప్, హత్య జరిగింది. ఇది పాశవికం. అయితే ఈ ఉదంతంలో దర్యాప్తు తీరు పేలవంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూ డిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ‘నా 30 ఏండ్ల అనుభవం లో ఇటువం టి దర్యాప్తు తంతును నేనైతే చూడలేదు. మీ రాష్ట్రం ఈ కేసు విషయంలో అనుసరిస్తున్న వైఖరి ఇంతకు ముందెన్నడూ, ఎక్కడా చూ డని విధంగా ఉంది’ అని న్యాయమూర్తులలో ఒక్కరైన జెబి పార్థీదాలా ఘాటుగా స్పందించారు.

లేడీడాక్టర్‌పై హత్యాచారం ఘటన విషయంపై సుప్రీంకోర్టు తనంతతానుగా స్పందించి సుమోటోగా కేసును విచారిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా కేసు నమోదు చేయడం, ముందుగా దీనిని అనుమానాస్పద మృతిగా పేర్కొనడం, అసలు సంఘటన ఏ సమయానికి జరిగిందనే విషయంలో సరైన పొంతన లేకుండా పేర్కొనడం వంటివి తమను కలత చెందేలా చేశాయని జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యునిగా ఉన్న ధర్మాసనం మందలించింది. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6.10 గంటలు 7.10 మధ్యలో పోస్టుమార్టం నిర్వహించారు. మరి అప్పటికీ పోలీసులు ఈ ఘటనలో అసహజ మరణం కేసు కూడా దాఖలు చేయలేదు.

మరి కేసు దాఖలు కాకముందే పోస్టుమార్టం జరిగిందా? హత్యాచారం ఘటనలో తొలి ఎంట్రీ వెలువరించిన పోలీసు అధికారి ఎవరో ఆ వ్యక్తి తమముందుకు తదుపరి విచారణ తేదీన హాజరుకావల్సి ఉంటుందని ఆదేశించారు. ఎంట్రీ ఎప్పుడు జరిగిందనేది తెలియచేయాలని పేర్కొన్నారు. ఘటన తరువాత పోలీసులు చేపట్టిన పలు చర్యలు అనుమానాస్పదం అవుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. పోస్టు మార్టం తరువాతనే నేరం జరిగిన చోటును దిగ్బంధనం చేశారు. ఈ విధంగా ఎందుకు జరిగిందని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. అసహజ మరణం అనేది పోలీసులకు ముందే తెలిసినప్పుడు, రాత్రిపూట పోస్టుమార్టం జరిపించారు. కానీ అప్పటివరకూ ఈ ప్రాంతాన్ని ఎందుకు దిగ్బంధించలేదు.

క్రైమ్ సీన్‌ను మార్చేశారు..కేసు నమోదుపై గందరగోళం
డాక్టర్ హత్యాచారంపై గురువారం సిబిఐ సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టు అందించింది. ఇందులో మూడు కీలక విషయాలను ప్రస్తావించింది. 1 క్రైమ్ సీన్‌ను స్థానిక పోలీసులు తారుమారు చేశారు.2 ముందుగా ఆత్మహత్య అని తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. 3 అంత్యక్రియల తరువాత కేసు దాఖలు చేశారు. రెసిడెంట్ డాక్టర్లు , సిబ్బంది నిరసనల క్రమంలో ఇది హత్య అని పోలీసులు తెలిపారు. ముందు ఇది హత్య అన్నారు. అయితే అత్యంత దారుణ అత్యాచారం జరిగింది. సాక్షాల తారుమారుకు యత్నించారు.

ఘటన తరువాత ఐదోరోజున తాము దర్యాప్తు చేపట్టినట్లు, అప్పటికే సాక్షాలను తారుమారు చేసినట్లు, నిజానికి ఘటనా స్థలం కూడా మార్చినట్లు తమ పరిశీలనలో తేలిందని సిబిఐ పేర్కొంది. పట్టుబడ్డ నిందితుడు సంజయ్ రాయ్‌కు ఇప్పటివరకూ లై డిటెక్టర్ టెస్టు జరగలేదని కూడా సిబిఐ వెల్లడించింది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు సహజంగా ఘటన చోటు వద్ద భద్రత అవసరం , అయితే అదేమీ జరగలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను వెంటనే బర్తరఫ్ చేశారు. ఆయనకు ఈ ఘటన విషయంలో ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికి యత్నించినట్లు అనుమానం వస్తోంది. ఘటన గురించి తెలిసిన తరువాత కూ డా ప్రిన్సిపాల్ దీనిపై పెద్దగా స్పందించలేదని వెల్లడైనట్లు సిబిఐ నివేదికలో తెలిపింది.

బెంగాల్ ప్రభుత్వం తరఫున 21 మంది లాయర్లు
ఈ కేసు విచారణ సందర్భంగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏకంగా 21 మంది సీనియర్ లాయర్ల బృందం హాజరయింది. ఈ న్యాయవాదుల్లో కపిల్ సిబల్ కూడా ఉన్నారు. కేసు నమోదు సమయం గురించి సీరియస్‌గా వాదనల దశలో సిబల్ నవ్వుతూ ఉండటం గమనించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోపంతో సిబల్‌ను ఉద్ధేశించి ఎందుకా నవ్వు? అని ప్రశ్నించారు. ఓ యువతి అత్యంత అమానుష రీతిలో ప్రాణాలు కోల్పోతే , మీరు పగులబడి నవ్వుతున్నారా? అని మండిపడ్డారు. నిజానికి ట్రైనీడాక్టరు అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత రాత్రి 11.45 గంటలకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారని తుషార్ మెహతా చెప్పారు. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు విన్పించారు.

దీనికి సిబల్ స్పందిస్తూ బాదితురాలి తండ్రి ఎఫ్‌ఐఆర్ దాఖలకు అనుమతించకపోవడంతోనే ఆలస్యం జరిగిందన్నారు. సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులు యువతి తల్లిదండ్రులకు ముందుగా ఆమెది ఆత్మహత్య అని చెప్పారని, దీనిపై తోటి డాక్టర్లు అభ్యంతరం చెప్పడం, ఘటనపై పోలీసులు నిజాలు దాచిపెట్టి, విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని , పోస్టుమార్టం, ఘటనాస్థలాన్ని వీడియో తీయాలని పట్టుబట్టారని , ఈ క్రమంలోనే తరువాత పోలీసులు ఇది హత్య అని చెప్పారని, ఆ తరువాత ఇది హత్య కాదు అత్యాచారంతో కూడిన హత్యగా వెలుగులోకి వచ్చిందని తుషార్ మెహతా వివరించారు. ఈ కేసు విచారణ దశలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం డాక్టర్లు తమ నిరసనలను విరమించుకోవాలని మరోమారు విజ్ఞప్తి చేసింది. అన్ని విషయాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సామాజిక మాద్యమాల ప్రచారాలు నమ్ముతారా?
లేడీ డాక్టర్ హత్యాచారోదంతంపై సామాజిక మాధ్యమాలలో వస్తున్న కథనాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సిబిఐ వీటిని ఎందుకు పరిగణనలోకి తీసుకొంటోంది, బాధితురాలి అంతర్భాగంలో 151 గ్రాముల వీర్యం ఉందని పేర్కొంటూ వెలువడ్డ కథనం కోర్టు వాదనల్లో ఎందుకు ప్రస్తావిస్తున్నారని సిబిఐ తరఫు న్యాయవాదిని ధర్మాసనం మందలించింది.
డాక్టర్లూ… విధులకు వెళ్లండి
అంతా నిరసనలు వీడి పనులకు వెళ్లాల్సి ఉంది. సంబంధిత విషయంలో సార్వత్రిక ఆదేశాలు వెలువరిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ముందుగా డాక్టర్లు విధులకు వెళ్లాలి. ఆసుపత్రులలో సాధారణ పరిస్థితి ఏర్పడాలి . నిరసనల దశలో అధికారుల నుంచి వెలువడ్డ తలెత్తిన వేధింపులు ఇతర విషయాలను పరిశీలించడం జరుగుతుందని , పరిస్థితిని చక్కదిద్దుతామని డాక్టర్లకు ధర్మాసనం తెలిపింది. డాక్టర్లు విధుల్లోకి వెళ్లకపోతే ప్రజా సంబంధిత నిర్వహణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రత్యేకించి రోగులకు చికిత్సలు, అత్యయిక పరిస్థితుల్లో తీసుకోవల్సిన చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. మొత్తం ఆరోగ్య చికిత్స వ్యవస్థ డాక్టర్ల , ఆసుపత్రి సిబ్బంది సహకారం లేకుండా ఎట్లా నడుస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది.ఒక జాతీయ స్థాయి కార్యాచరణ కమిటీ ఏర్పాటు అవుతుంది. ఈ టాస్క్‌ఫోర్స్ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News