ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమర్థించుకోవడానికి
ప్రయత్నించడం కంటే పునరుద్ధరణ ప్రణాళికను చేస్తే ప్రయోజనం
కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికకు ప్రతిస్పందనగా
కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి నాలుగు వారాల సమయం
స్టేటస్ కో కొనసాగింపు, తదుపరి విచారణ మే 15కు వాయిదా
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో వివాదాస్పదంగా మారిన కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదు రైంది. కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికకు ప్రతిస్పందనగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. అవి ప్రభుత్వ భూములు అని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏ సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇదివరకే కౌంటర్ దాఖలు చేసింది.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం మరో సారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మే 15వ తేదీకి వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములపై విచారణ సందర్భంగా జడ్జి జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమర్థించుకోవడానికి ప్రయ త్నించడం కంటే పునరుద్ధరణ ప్రణాళికను చేస్తే ప్రయోజనం చేకూరుతుందని ధర్మాసనం నొక్కి చెప్పింది. సరైన, ఆమోదయోగ్యమైన ప్రణాళికను సమర్పించడంలో విఫలమైతే కొంతమంది అధికారులు తాత్కాలికంగా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ కోర్టు తన వైఖరిని స్పష్టం చేసింది. బుల్డోజర్లను రంగంలోకి దింపి సుమారు 100 ఎకరాల భూమిలో చెట్లను తొలగించడం ముఖ్యమైన ఆందోళన అని ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించకపోతే జైలు అనివార్యం
1996లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చెట్టు కొట్టేసే ముందు పర్మిషన్ తీసుకున్నారా? లేదా? అని బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమ తులు తీసుకున్నాకే ఆ భూముల్లో జామాయిల్ చెట్లు, కంప, పొదలను తొలగింపు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు వెల్లడించారు. రాష్ట్రంలో వాల్టా చట్టం అమల్లో ఉందని, ప్రభుత్వం దాని ప్రకారం చర్యలు తీసుకుందని అమికస్ క్యూరీ చెప్పారు. ఒకవేళ పర్మిషన్ లేకుండా చెట్లు తొలగించినట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కొందరు అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని గవాయ్ హెచ్చరించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పనని ఘాటు వ్యాఖ్యలుు చేశారు. కంచ గచ్చిబౌలి భూములను రూ.10 వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని కేంద్ర సాధికార కమిటీ నివేదికలో చెప్పినట్లు అమికస్ క్యూరీ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ భూములను ప్రభుత్వం అమ్ముతుందా? మార్టిగేజ్ చేస్తున్నారా? అనేది తమకు అనవసరమని ధర్మాసనం చెప్పింది. ఆ వందల ఎకరాలలో చెట్లు కొట్టివేయడానికి ముందు పర్మిషన్ తీసుకున్నారా? లేదా? అనేది అసలు విషయమని బిఆర్ గవాయ్ పేర్కొన్నారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఆ భూములపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. మే 15 కు తదుపరి విచారణ వాయిదా వేస్తూ ఆ భూములలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. 400 ఎకరాలు భూములకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇటీ వల విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం అవి అటవీ భూములా? అందులో జంతువులు ఉన్నాయా? అనే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆ 400 ఎక రాల ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.