Wednesday, January 22, 2025

సుప్రీం సీరియస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇదరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టుగురువారం తీవ్రంగా స్పందించింది. ఈ దాడా ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మణిపూర్ మహిళలపై అమానవీయఘటనను ఖండించింది. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించిన సిజెఐ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే ఏం చేస్తున్నారని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను నిలదీసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు స్పందించకపోతే తామే చర్య తీసుకుంటామని సిజెఐ స్పష్టం చేశారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

గురువారం బెంచ్ ఈ రోజు విచారించాల్సిన అంశాలపై విచారణ కోసం సమావేశం కాగానే సిజెఐ చంద్రచూడ్ మాట్లాడుతూ కోర్టుకు రావలసిందిగా తాను అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరినట్లు తెలిపారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మే 4వ తేదీ నాటిదని తమకు తెలుసునని, అయినా తేడా ఏమీ ఉండదని బెంచ్ వ్యాఖ్యానించింది. మే నెలనుంచి ఈ ఘటనకు పాల్పడిన వారిని చట్ట ముందు నిలబెట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారు, అలాగే ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సిజెఐ అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించారు.

ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో హింసను రెచ్చ గొట్టడం కోసం మహిళలను పావులుగా వాడుకున్న ఘటనలు జరిగాయని, అయితే రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. సిజెఐ వ్యాఖ్యలతో ఏకీభవించిన తుషార్ మెహతా, ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై తీవ్రంగా ఆందోళన చెందుతోందని అంటూ, దీనికి సంబంధించి తీసుకున్న చర్యలను తాను కోర్టుకు తెలియజేస్తానని మెహతా హామీ ఇచ్చారు. అనంతరం బెంచ్ ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News