ఎంఎల్‌ఎల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గతంలో ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి
రాయగలమని ప్రశ్న పార్టీ ఫిరాయింపులకు
వార్షికోత్సవం పూర్తి అయిందంటూ దెప్పిపొడుపు
తదుపరి విచారణ ఏప్రిల్ 2 వ తేదీకి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ నిర్ణయాన్ని కాదని ముందుకు వెళ్లలేమంటూ సుప్రీంకోర్టు ధర్మాస నం స్పష్టం చేసింది. ఈ అంశంలో ఉన్నత ధర్మాసనాల తీర్పులను మేము ఎలా తిరిగి రాయగలం? అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో బీఆర్‌ఎ స్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించడం పై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు లో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం – విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2 వ తేదికి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదన్నారు. నోటీసు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడారని, ఆ తర్వాత కూడా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై ఏం చేస్తారో నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు.
అయినప్పటికీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వలేదన్నారు. ఈ అంశం పై సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే వారికి నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై 3 వారాలలో సమాధానం ఇవ్వాలని ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేసారు. ఆ గడువు కూడా పూర్తి అయింది కానీ, ఆ నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదని న్యాయవాది సుందరం పేర్కొన్నారు. మేము ఫిర్యాదు చేసి ఏడాది గడిచినా స్పీకర్ ఇంతవరకు షెడ్యూల్ చేయలేదని వాపోయారు. ఈ క్రమంలో జడ్జి జస్టిస్ గవాయ్ స్పందిస్తూ, పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని అన్నారు. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి ఎలా రాయగలమని ప్రశ్నించింది. అనంతరం పిటిషనర్ల వాదనలు ముగియడంతో విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 2 వ తేదికి వాయిదా వేసినట్టు ప్రకటించింది.