Sunday, December 22, 2024

తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం తీవ్ర ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

మా తీర్పునే ధిక్కరిస్తున్నారా?

తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మీ ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది
ప్రొన్ముడిని మంత్రిగా వెంటనే నియమించండి
లేకపోతే శుక్రవారం మేమే నిర్ణయం తీసుకుంటాం
గవర్నర్ రవిపై సిజెఐ మండిపాటు

న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్వ్రిపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఎంకె ఎమ్మెల్యే కె పొన్ముడికి దిగువ కోర్టు విధించిన శిక్షను తాము నిలిపివేసినప్పటికీ ఆయనను తిరిగి మంత్రిగా చేర్చుకోవాలన్న తమిళనాడు క్యాబినెట్ సిఫార్సును గవర్నర్ నిరాకరించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి చర్యను సవాలు చేస్తూ ఎంకె స్టాలిన్ సారథ్యంలోని డిఎంకె ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన సిజెఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్ రవి చర్యపై మండిపడింది.

ఈ కేసులో గవర్నర్ ప్రవర్తన గురించి తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని సిజెఐ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునే ఆయన(గవర్నర్) ధిక్కరిస్తున్నారు అంటూ సిజెఐ ఆగ్రహించారు. మీరేం చేస్తున్నారు? పొన్ముడికి విధించిన శిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఆయన ఎందుకు మంత్రిగా ప్రమాణం చేయకూడదు? మీ గవర్నర్‌కు చెప్పండి. లేనిపక్షంలో మేగు దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది అంటూ సిజెఐ గవర్నర్ తరఫు న్యాయవాదిని సిజెఐ హెచ్చరించారు.

తమిళనాడు ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వం నడపడానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రతి నిర్ణయానికి తాము సుప్రీంకోర్టుకు రావలసి వస్తోందని సింఘ్వి తెలిపారు. తాము ఎందుకు ప్రతిసారి ఇలా రావాలని, ఇటువంటి చర్యలకు గవర్నర్ ఎందుకు పాల్పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పొన్ముడిని మంత్రిగా ప్రమాణం చేయించడానికి శుక్రవారం(మార్చి 22) వరకు గవర్నర్‌కు సిజెఐ చంద్రచూడ్ గడువు విధించారు. పొన్ముడిపై ఆయనకు(గవర్నర్) ఎటువంటి అభిప్రాయాలైనా ఉండవచ్చు కాని రాజ్యాంగం ప్రకారం నడుచుకోవలసిందేనని సిజెఐ పేర్కొన్నారు. శుక్రవారం వరకు మీకు సమయం ఇస్తున్నామని, లేనిపక్షంలో శుక్రవారం తమ తీర్పును వెలువరిస్తామని సిజెఐ తెలిపారు.

కాగా..ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో ప్రత్యేక కోర్టు డిఎంకె ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొన్ముడికి మూడే ళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పునుసస్పెండ్ చేస్తూ మార్చి 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే రాష్ట్ర క్యాబినెట్‌లోకి పొన్ముడిని తిరిగి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ రవి వ్యతిరేకించారు. ఆయనను మంత్రిగా నియమించడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. దీనిపై డిఎంకె ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో కూడా అనేక బిల్లును ఆమోదించడంలో గవర్నర్ చేస్తున్న జాప్యాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News