ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులను ఆపేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజులుగా కొనసాగుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారంపై గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఆ భూముల్లో ఉన్న చెట్లను ప్రభుత్వం జేసీబీల ద్వారా తొలగించడంపై సుప్రీం ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. అక్కడ ఇంత అత్యవసర కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని.. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 16న చేపట్టనున్న తెలిపింది.