ఏపికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
పోలవరం.. పట్టిసీమపై జరిమానచెల్లించాల్సిందే
పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయి
ఎన్జీటి తీర్పును సమర్ధించిన ధర్మాసనం
ఫైన్‌గా విధించిన రూ.250కోట్లపైనా ఫిబ్రవరిలో విచారణ
ప్రతివాదులకు నోటీసులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పోలవరం పట్టిసీమ పురుషోత్తమ పట్నం సాగునీటి పథకాల నిర్మాణాలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ వెంటనే ఈ తీర్పును అమలు చేస్తూ తగిన నష్టపరిహారం చెల్లించాల్సిందే అని సోమవార ఢిల్లీలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.250కోట్ల నష్ట పరిహారంపై కూడా తదుపరి విచారణ కొనసాగిస్తామని ధార్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై పట్టిసీమ , పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలను నిర్మించింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టింది. ఈ పథకాలకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని దాఖలైన అభియోగాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో విచారణ జరిగింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ప్రభుత్వం పర్యావరణ పరమైన నియమ నిబంధనలు పాటించటం లేదని విచారణలో స్పష్టమైంది.
దీంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ సంయుక్త కమిటి రూ.250కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు నిచ్చింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు పూర్వ పరాలు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి రూ.2.48కోట్లు, పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రూ.1.90కోట్లు పరిహరంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ జారీ చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సంయుక్త కమిటి ఇచ్చిన తీర్పులోని అన్ని అంశాలను యధాతధంగా అమలు చేయాలని ఆదేశించింది. రూ.250కోట్లు డిపాజిట్ చేసే అంశానికి సంబంధించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
Supreme Court Shock to AP Govt over Polavaram