న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన కొవిడ్ టీకాల సేకరణ, పంపిణీ విషయంలో కేంద్రం రాష్ట్రాలపై బాధ్యతను నెట్టడం ఇతరత్రా విపరీత పరిణామాలకు దారితీస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒకే దేశం ఒకే టీకా ధర పద్ధతిని కేంద్రం ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలకు పొందాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది. టీకాల కొనుగోళ్ల ప్రక్రియను కేంద్రం పూర్తిగా తానే ఎందుకు చేపట్టడం లేదు? అని ప్రశ్నించింది. ధరల ఖరారు అధికారాన్ని కేంద్రం టీకాల తయారీ సంస్థలకు వదిలిపెట్టడం, రాష్ట్రాలే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని తెలియచేయడం అనుచితం అని తెలిపింది.
ఇక్కడి కంపెనీల నుంచి వ్యాక్సిన్లు సరిగ్గా అందకపోవడంతో కొన్ని రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు స్వయంగా దిగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం టీకాలు అందించే వారు ఎవరైనా ముందుకు రావచ్చునని ఆహ్వానించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రష్యాకు చెందిన స్ఫుత్నిక్ టీకాల సేకరణకు బిడ్లు పొందింది. కేంద్రం మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు టీకాల విషయంలో రాష్ట్రాలే విదేశాల నుంచి నేరుగా టీకాలు పొందేందుకు వీలు కల్పించడం సరికాదని, ఇది అసమగ్రతకు దారితీస్తుందని హెచ్చరించింది. దేశంలో కరోనా టీకాల పాలసీ అసమగ్రతపై విచారణ దశలో సుప్రీంకోర్టు ప్రత్యేకంగా టీకాలు రాష్ట్రాలు సేకరించుకునే అంశం గురించి ప్రస్తావించింది.
Supreme Court slams Centre over Covid Tika Policy