Monday, December 23, 2024

ఇడికి సుప్రీం మొట్టికాయలు!

- Advertisement -
- Advertisement -

దర్యాప్తుల సమయంలో భయోత్పాత వాతావరణం సృష్టించొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి)ను సుప్రీంకోర్టు హెచ్చరించడం ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఒక మంచి పరిణామం. కేంద్రం సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేస్తున్నదని 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గత ఏప్రిల్ 5న భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్, జస్టిస్ జెబి పర్దివాలాల ధర్మాసనం తిరస్కరించింది. దానితో ఇడి, సిబిఐల ఆగడాలకు, ప్రతిపక్ష నేతలపై వాటిని విచక్షణ లేకుండా కేంద్రం ప్రయోగించడానికి హద్దు, ఆపు వుండబోవనే ఆందోళనకు ప్రజాస్వామ్య ప్రియులు గురయ్యారు.

రూ.2000 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్‌ను ఇరికించడానికి ఇడి తమ రాష్ట్రంలో భయానక స్థితిని సృష్టిస్తున్నదంటూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో మొన్న మంగళవారం నాడు న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, అసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం ఈ మేరకు ఆ కేంద్ర దర్యాప్తు సంస్థను తీవ్రంగా హెచ్చరించింది. ఇడి తన విధి నిర్వహణలో భాగంగా అవతలి వారిని బెదిరించి, భయపెట్టినట్లయితే అది చేయదలచుకొనే మంచికి కూడా చెడు జరుగుతుందని, మంచి కోసం తాను చేసే కృషిని సైతం అనుమానించవలసి వస్తుందని ధర్మాసనం పేర్కొన్నది.

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, విచారణ సమయంలో ఇడి తమను శారీరక, మానసిక హింసకు గురి చేసిందని ఆ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు 52 మంది ఫిర్యాదు చేసినట్టు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళారు. వాస్తవానికి రాజ్యాంగం 131వ అధికరణ ప్రకారం కేంద్ర చట్టాన్ని సవాలు చేసే అధికారం తనకున్నదని చత్తీస్‌గఢ్ ఇటీవల ఒక పిటిషన్‌లో పేర్కొన్నది. మనీ లాండరింగ్ చట్టంలోని కొన్ని నిబంధనలను కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేసి భయపెట్టడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశమున్నదని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక పిటిషన్‌లో సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఇడి కొంత మంది ఎక్సైజ్ అధికారులను భౌతికంగా హింసించిందని తెల్లకాగితాల మీద, ముందే తయారు చేసిన పత్రాలపైన సంతకాలు చేయాలని బలవంతపెట్టిందని చత్తీస్‌గఢ్ పేర్కొన్నది. ఇడి చర్యల వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం సవ్యంగా పరిపాలన సాగించలేని పరిస్థితి తలెత్తిందని ఫిర్యాదు చేసింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ, ఇడి దాడులు విచక్షణా రహితంగా, విచ్చలవిడిగా సాగుతున్న విషయాన్ని ప్రత్యేకించి నిరూపించనవసరం లేదు.

2004లో ఇడి 112 దాడులు మాత్రమే జరుపగా, 2022లో ఈ సంఖ్య 3,010కి చేరింది. అంటే 27 రెట్లు పెరిగింది. ఈ సమాచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత ఏడాది జులై 27న స్వయంగా రాజ్యసభకు తెలియజేశారు. 2014 నుంచి 2022 వరకు రూ. 99,356 కోట్ల విలువైన ఆస్తులను ఇడి జప్తు చేసింది. అదే యుపిఎ ప్రభుత్వ హయాంలో (2004 05 నుంచి 201314 వరకు) కేవలం రూ. 5346 కోట్ల ఆస్తులే జప్తయ్యాయి. ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఇడి పెడుతున్న కేసులన్నీ బిజెపియేతర రాష్ట్రాల్లోనే అన్నది అందరూ గమనించవలసిన ఒక కఠోర సత్యం. ఈ కేసుల్లో 95% ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో నమోదైనవే. నితీశ్ కుమార్ బిజెపితో తెగతెంపులు చేసుకొని ఆ వెంటనే రాష్ట్రీయ జనతాదళ్ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విశ్వాస పరీక్షకు నిలబడడానికి ముందు ఉన్నపళంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన 25 చోట్ల సిబిఐ దాడులు జరిగాయి. 200809లో లాలూ రైల్వే మంత్రిగా వుండగా ఉద్యోగాల కోసం భూమిని లంచంగా తీసుకొన్నారంటూ దాఖలైన కేసుకు సంబంధించి ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు సిబిఐ దాడి చేయడంలోని ఆంతర్యం తెలిసిందే.

ఆర్‌జెడి మెడలు వంచి నితీశ్ కుమార్‌కు మద్దతు ఉపసంహరించుకొనేలా చేయడానికి తప్ప ఇంకెందుకు ఈ దాడులు జరిపినట్టు? బిజెపి రాష్ట్రాలన్నింటా సత్యహరిశ్చంద్రులే పరిపాలిస్తున్న చందంగా కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే సిబిఐ, ఇడి దాడులు జరగడంపై ఒక బిఆర్‌ఎస్ నేత గతంలో ఆశ్చర్యం వెలిబుచ్చారు. కర్ణాటకలో ప్రతి కాంట్రాక్టుకు 40% కమీషన్ తీసుకున్నందుకే కదా అక్కడి బిజెపి ప్రభుత్వాన్ని నిన్న మొన్ననే ఆ రాష్ట్ర ప్రజలు గద్దె దింపి ఆ పార్టీని శంకరగిరిమాన్యాలు పట్టించారు. అక్కడ బొమ్మై మంత్రి వర్గంలోని ఒక్క మంత్రి మీద కూడా ఇడి దాడులు, సోదాలు ఎందుకు జరగలేదు? చత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి సిబిఐ, ఇడిలు తమపై దృష్టి కేంద్రీకరించాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగేల్ ఆరోపించిన మాట అవాస్తవమని భావించలేము. దొడ్డి దారిలో పాయసం తినమరిగినవారు దానిని మానుకోలేరు. సకాలంలో ఇడిని హెచ్చరించినందుకు సుప్రీంకోర్టును ప్రశంసించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News