Friday, December 20, 2024

గవర్నర్లూ నిప్పుతో చెలగాటాలొద్దు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ‘ గవర్నర్లుగా ఉన్న మీరు నిప్పుతో చెలగాటమాడుకుంటున్నారు. బిల్లుల ఆమోదంలో జాప్యం ఎందుకు? పంజాబ్, తమిళనాడులలో జరుగుతున్న ఈ తంతు మాకు బాగా అన్పించడం లేదు’ అని శుక్రవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పంజాబ్ , తమిళనాడు గవర్నర్ల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వాలతో కూడిన అసెంబ్లీల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కీలక అంశాలపై ఆమోదించిన బిల్లులను గవర్నర్లు కొందరు ఆమోదం తెలియచేయకుండా తొక్కిపెట్టి ఉంచడం వివాదాస్పదం అవుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్లకు మధ్య ప్రచ్ఛన్న పోరు నెలకొంటోంది. ఈ రెండు రాష్ట్రాల గవర్నర్లు అసెంబ్లీల బిల్లుల ఆమోదంలో జాప్యానికి దిగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇది మంచి పద్థతి కాదని తేల్చిచెప్పారు.

పరిపాలనా సౌలభ్యంకోసం, విధానపరమైన నిర్ణయాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులను తీసుకువస్తాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీలను గవర్నర్లు కాదంటారా? ఇది తీవ్రస్థాయి ఆందోళనకర విషయం అవుతుందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఆమోదిత బిల్లులకు తూట్లు పొడిచే పద్థతి వీడితే మంచిదని గవర్నర్లకు సమున్నత ధర్మాసనం హితవు పలికింది. గవర్నర్ల తీరు నిప్పుతో చెలగాటాలను తలపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలలో గవర్నర్ల తీరు తమకు అనుచితంగా అన్పిస్తోందని బెంచ్ పేర్కొంది. ఇంతకు మనం పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రక్రియను కొనసాగించుకోవాలా? వద్దా అని నిలదీశారు. భారతదేశం నిర్థిష్ట పద్ధతులు, విధివిధానాలకు కట్టుబడి సాగుతోంది. వీటిని వారు వారు అని కాకుండా ప్రతి ఒక్కరూ పాటించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పంజాబ్‌లో ప్రతిపక్ష ఆప్ ప్రభుత్వం ఉంది. తమిళనాడులో డిఎంకె సారధ్యపు ప్రభుత్వం ఉంది.

ఈ రెండు రాష్ట్రాలలో సిఎంలకు గవర్నర్లకు మధ్య వివాదం నెలకొంటోంది. గవర్నర్ బన్వారీలాల్ బిల్లుల ఆమోదంలో జాప్యం చేస్తున్నారని పేర్కొంటూ పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటువంటి అప్రజాస్వామిక చర్యతో తమ ప్రభుత్వ అధికార యంత్రాంగం స్తంభించిపోతోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ప్రభుత్వం తరఫున న్యాయస్థానానికి నివేదించారు. రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికీ ఏడు బిల్లులను ఆమోదించింది. ఇందులో విద్యారంగం, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ విషయాల బిల్లులు కూడా ఉన్నాయి. వీటన్నింటిని గవర్నర్ తొక్కిపెట్టి ఉంచుతూ వచ్చారని వివరించారు. బిల్లులను ఈ ఏడాది జులైలో గవర్నర్ ఆమోదానికి పంపించారని , ఇప్పటికీ వీటికి ఆమోదం దక్కకపోవడంతో రాష్ట్రంలో పాలన కుంటుపడుతోందని న్యాయవాది తెలియచేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కలుగచేసుకుని వీటి విషయంలో గవర్నర్ తీసుకున్న చర్యల వివరాలను తమకు కేంద్రం తరఫున అందించాల్సి ఉందని అటార్నీ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించారు.

ఇక తమిళనాడు గవర్నరు ఎన్ రవి వైఖరిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను ఆమోదించకుండా ఉంచడంతో తలెత్తుతున్న ఇబ్బందులను తెలియచేశారు. వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవల్సి ఉందని అభ్యర్థించారు. గవర్నర్ తన సాగదీతల వైఖరితో ప్రజాతీర్పును కించపరుస్తున్నారని , ఎంతకూ అనుమతిని ఇవ్వకపోవడం ఏ పరిస్థితికి దారితీస్తుందని డిఎంకె ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News