సుప్రీంకోర్టు తొమ్మిదింటికి తెరవలేమా
జస్టిస్ యుయు లలిత్ ప్రశ్న
వచ్చే నెలలో ఆయనే సిజెఐ
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకే కొలువుతీరాలని తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (యుయు లలిత్) శుక్రవారం తెలిపారు. సాధారణంగా సుప్రీంకోర్టు ఉదయం పదిన్నరకు సమావేశం అవుతుంది. అయితే ఓ కేసు విచారణకు సంబంధించి యుయు లలిత్ సారధ్యపు ధర్మాసనం శుక్రవారం ఓ గంట ముందు భేటీ అయ్యింది. వచ్చే నెలలో లలిత్ దేశ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ స్థానంలో ఈ పదవిలోకివస్తారు. ఉదయం గంటముందు సుప్రీంకోర్టు విచారణ చేపట్టడంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రొహత్గీ హర్షం వ్యక్తం చేశారు. ఈ దశలో కాబోయే చీఫ్ జస్టిస్ స్పందిస్తూ ‘ బడి పిల్లలు స్కూళ్లకు ఉదయం 7 గంటలకు వెళ్లుతారు. మరి జడ్జిలు , లాయర్లు దైనందిన న్యాయస్థాన ప్రక్రియను ఉదయం 9 గంటలకు ఆరంభిస్తే తప్పేమిటీ? ’ అని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తొందరగా తెల్లారాల్సి ఉంటుందన్నారు. కోర్టు నెంబరు 2లో ధర్మాసనం తొమ్మిదిన్నర గంటలకు విచారణకు దిగింది. కోర్టులు కార్యకలాపాలను ఆరంభించేందుకు ఇదే మంచి అనువైన సమయం అని మాజీ అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు. దీనిపై జస్టిస్ లలిత్ స్పందిస్తూ పొద్దునే కోర్టు పనులు ఆరంభిస్తే చాలా మంచిది. మనం ఈ విషయంలో కనీసం చిన్నబడీడు పిల్లలను అయినా ఆదర్శంగా తీసుకుంటే మంచిదని చమత్కరించారు. 9 గంటలకు ఆరంభం అయితే పదకొండున్నర కల్లా విచారణ ప్రక్రియకు కొంత విరామం ఇచ్చుకోవచ్చు తరువాత మధ్యాహ్నం విచారణ ముగించుకోవచ్చు. ఈ విధంగా పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటి పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టు వారానికి ఐదురోజులుపనిచేస్తుంది. ఉదయం పదిన్నరకు ఆరంభం అవుతుంది. నాలుగు గంటలకు ముగిసే షెడ్యూల్‌లో గంట సేపు భోజనవిరామ వ్యవధి ఉంటుంది. ఇది సాధారణంగా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకూ ఖరారు అయి ఉంది.
ఆగస్టు 27న సిజెఐగా యుయు ఎల్ బాధ్యతలు
భారతదేశ తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ఆగస్టు 27వ తేదీన బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రమణ స్థానంలో వచ్చే లలిత్ సర్వీసు ఈ ఏడాది నవంబర్‌తోనే ముగుస్తుంది. దీనితో ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ నవంబర్ 8 వరకూ ఉంటారు. 1957 నవంబర్‌లో జన్మించిన లలిత్ గతంలో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఈ దశ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా పదోన్నతి పొందిన వారిలో లలిత్ ఆరో వ్యక్తి. న్యాయవాద కుటుంబం నుంచి లలిత్ వచ్చారు. తండ్రి యుఆర్ లలిత్ బొంబాయి హైకోర్టు అదనపు జడ్జిగా ఉండేవారు. జస్టిస్ లలిత్ నాగ్‌పూర్‌కు చెందిన వారు.