న్యూఢిల్లీ : ”ది కేరళ స్టోరీ ” సినిమాపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు గురువారం నిలిపివేసింది. ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. భావోద్వేగాలు వాక్‌స్వాతంత్య్రాన్ని నిర్దేశించజాలవని స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) సర్టిఫికెట్ ఇచ్చినందున శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పింది. సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
మే 5న విడుదలైన ఈ సినిమాపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 8న నిషేధం విధించింది. తమిళనాడు ప్రభుత్వం కూడా పరోక్షంగా ఇలాగే చేసింది. ఈ సినిమా నిర్మాత సన్‌షైన్ ప్రొడక్షన్స్ ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రదర్శించడం లేదని పిటిషనర్లు తెలిపారు. దీనిపై స్పందించాలని మే 12న సుప్రీం కోర్టు ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో సినిమా ప్రదర్శన నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కేరళ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.
32 వేల మంది యువతులను ఇస్లాం లోకి మార్చినట్టు చెప్పిన విషయంపై ఓ ప్రకటనను మే 20 సాయంత్రం 5 లోగా ఈ సినిమాలో చేర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సినిమాకు సిబీఎఫ్‌సీ సర్టిఫికెట్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జులై రెండో వారంలో విచారణ జరుపుతామని తెలియజేసింది. అయితే ఈ సర్టిఫికేషన్ జారీపై చట్టబద్ధమైన అపీలు ఏదీ దాఖలు కాలేదని ఈ సినిమా నిర్మాత చెప్పారు. సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్‌పై అపీలును విచారించలేమని గతంలో చాలా తీర్పుల్లో చెప్పారని గుర్తు చేశారు.