Saturday, November 23, 2024

మూలాలు బయటపడేనా?

- Advertisement -
- Advertisement -

Cabinet nod likely for electoral reforms bill

గత వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కుదిపి వేసిన పెగాసస్ స్మార్ట్ ఫోన్ నిఘా వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ లోకూర్ కమిషన్ దర్యాప్తును సుప్రీంకోర్టు నిలిపివేసింది. లోకూర్ కమిషన్ తన దర్యాప్తును కొనసాగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వల్ల ఎంత వరకు మేలు జరుగుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. రైతు ఉద్యమంపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ వల్ల ప్రయోజనం కలుగలేదని ఆ నేపథ్యంలో పెగాసస్‌పై దాని కమిటీ ఎంత వరకు మంచి చేస్తుంది అనే అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎన్‌ఎస్‌ఒ గ్రూప్ కి చెందిన పెగాసస్ అదృశ్య నిఘా పరికరాన్ని (స్పైవేర్) దూరం నుంచే ఎవరి స్మార్ట్ ఫోన్‌లోనైనా ప్రవేశపెట్టి ఆ వ్యక్తి సంభాషణలు, సందేశాల వంటి వాటిని దొంగిలించవచ్చు. ఈ పరికరాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ, మీడియా ప్రముఖుల మీద ప్రయోగించినట్టు వివిధ అంతర్జాతీయ సంస్థలు, జర్నలిస్టులు జరిపిన పరిశోధనలో తెలిసింది. ఇందులో భాగంగా మన దేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ప్రధాని మోడీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనను ఎత్తి చూపిన మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహిత బంధువు అభిషేక్ బెనర్జీ మున్నగు అనేక మంది ప్రముఖులపై ప్రయోగించినట్టు పార్లమెంటు గత వర్షాకాల సమావేశాల ముందు రోజున బయటకు పొక్కింది. పెగాసస్ యాజమాన్యం కేవలం ఉగ్రవాదుల కదలికలపై నిఘా కోసం దేశాల ప్రభుత్వాలకు మాత్రమే ఈ పరికరాన్ని ఇస్తుంది. అందుచేత మన దేశంలో కేంద్ర ప్రభుత్వమే దీనిని ప్రయోగించిందనే అభిప్రాయం స్థిరపడిపోయింది. ప్రధాని మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెచ్చి పెగాసస్‌ను సంపాదించిందని, దానిని ప్రతిపక్షాల మీద, తన వ్యతిరేకుల మీద ప్రయోగించిందని భావిస్తున్నారు. అయితే కేంద్రం ఈ విషయంలో ఏమి చెప్పకుండా దర్యాప్తు డిమాండ్‌ను తిరస్కరించింది. దానితో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్వయంగా దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. ఆ విధంగా జస్టిస్ లోకూర్, మరో న్యాయమూర్తితో కూడిన కమిషన్‌ను నియమించించింది. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు ముందుకువచ్చి పెగాసస్ పై తాను కమిటీ వేయదలచినట్టు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ కమిటీతో ఇక పని లేదని చెప్పింది, కాని లోకూర్ కమిటీ తన దర్యాప్తును మానుకుంటున్నట్టు ప్రకటించలేదు. ఈ విషయంలో తగిన విచారణ జరిపించడానికి కేంద్రం ముందుకు రాకపోడంతో తాను చొరవ తీసుకోవలసి వచ్చిందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ తర్వాత లోకూర్ కమిషన్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయినా లోకూర్ దర్యాప్తు ఆగలేదని ఫిర్యాదు చేస్తూ గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అనే ప్రభుత్వేతర సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం మొన్న శుక్రవారం నాడు లోకూర్ దర్యాప్తుపై స్టే విధించింది. మాట ఇచ్చి కూడా బెంగాల్ ప్రభుత్వం లోకూర్ దర్యాప్తును ఆపనందుకు అసంతృప్తి ప్రకటించింది. సుప్రీంకోర్టు తాను ప్రకటించిన విధంగా పెగాసస్ ఫోన్ నిఘా మీద జస్టిస్ ఆర్‌వి రవీంద్రన్ కమిటీని ఏర్పాటు చేసింది.. రవీంద్రన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆయనతోపాటు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ నవీన్ కుమార్ చౌదరిని, కంప్యూటర్ సైన్స్‌లో అనుభవజ్ఞుడైన పి ప్రభాకరన్ ను, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ నిపుణులు అశ్విన్ అనిల్ గుమస్తేను నియమించింది. గతంలో పెగసస్‌ను వినియోగించిన ప్రభుత్వాల నుంచి సమాచారం సేకరించడం, అంతర్జాతీయ ప్రముఖుల విజ్ఞతను ఉపయోగించుకోడం ద్వారా లోతైన పరిశోధన జరిపి నిజాన్ని వెలికి తీసే పనిని ఈ కమిటీకి అప్పగించింది. గత అక్టోబర్ 21న నియమితమైన ఈ కమిటీ నివేదిక సమర్పణకు రెండు మాసాల వ్యవధి ఇచ్చింది. దీనిని నియమిస్తూ సుప్రీం ధర్మాసనం కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. దేశ భద్రత పేరుతో పౌరుల వ్యక్తిగత గోప్యతలోకి తొంగిచూసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని హెచ్చరించింది. జాతీయ భద్రతకు ముప్పువాటిల్లతుందనే నెపంతో పెగాసస్ కేసులో సుప్రీంకోర్టుతో సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. తానే స్వయంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తానన్నది. సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీపై జాతి పెట్టుకొన్న ఆశలు నీరు కారిపోరాదని, గోప్యత హక్కుతో ఆడుకొనేవారి ఆటలు కట్టాలని ప్రజలు కోరుకొంటున్నారు. దేశంలోని పౌర సమాజం మీద, ప్రతిపక్షం, ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ మున్నగు ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటి మీద దాడులు జరుగుతున్న వేళ పెగాసస్ మూలాలను తవ్వి రుజువు చేయగలిగితే ఎంతో మేలు కలుగుతుంది.

Supreme Court stay probe on Pegasus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News