Wednesday, January 22, 2025

వస్త్రధారణపై విద్యార్థినులకు స్వేచ్ఛ

- Advertisement -
- Advertisement -

క్యాంపస్‌లో హిజాబ్, బురఖా, క్యాప్, నఖాబ్‌లను నిషేధిస్తూ ముంబైలోని ఒక కళాశాల జారీచేసిన సర్కులర్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం పాక్షికంగా స్టే విధించింది. తాము ఏమి ధరించాలో ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థినుల వస్త్రధారణపై ఆంక్షలు విధించే అధికారం విద్యా సంస్థలకు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్‌జి ఆచార్య, డికె మరాఠే కాలేజ్‌లను నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం నోటీసులు జారీచేసింది. తాము ధరించే వస్త్రధారణ ఎంపికపై విద్యార్థినులకు స్వేచ్ఛ ఉండాలని, వారిపై ఒత్తిడి తీసుకురాకూడదని ధర్మాసనం పేర్కొంది. దేశంలో చాలా మతాలు ఉన్నాయన్న విషయం మీకు హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్లుందని కళాశాల యాజమాన్యంపై కోర్టు వ్యాఖ్యానించింది. విద్యార్థినుల మత విశ్వాసాలు వెల్లడి కాకూడదన్నదే కళాశాల ఉద్దేశమైతే తిలకం, బొట్టును ఎందుకు నిషేధించలేదని ధర్మాసనం ప్రశ్నించింది.

విద్యార్థుల పేర్లు వారి మత గుర్తింపును వెల్లడి చేయవా అని కళాశాల యాజమాన్యం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మాధవీ దివాన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అయితే క్లాస్‌రూములో విద్యార్థినులు బురఖా ధరించడానికి, క్యాంపస్‌లో ఎటువంటి మతపరమైన కార్యకలాపాలకు అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎవరూ దుర్వినియోగం చేయకూడదని ఆదేశించిన ధర్మాసనం ఏ రకమైన దుర్వినియోగం జరిగినా కోర్టును ఆశ్రయించవచ్చని కళాశాల యాజమాన్యానికి కోర్టు సూచించింది. క్యాంపస్‌లో హిజాబ్, బురఖా, నఖాబ్ ధారణపై కళాశాల యాజమాన్యం విధించిన నిషేధాన్ని సమర్థిప్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వగా దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. నిషేధం కారణంగా విద్యార్థునులు తరగతులకు హాజరుకాలేకపోతున్నారంటూ పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కొలిన్ గంసాల్వేజ్, న్యాయవాది అబిహా జైదీ కోర్టుకు తమ వాదనలు వినిపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News