కంచ గచ్చిబౌలి భూముల్లో
ప్రభుత్వ తీరుపై సుప్రీం ఆగ్రహం
మూడు రోజుల్లో 100 ఎకరాల్లో చెట్ల నరికివేత చిన్న విషయం కాదు చట్టాన్ని
చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించిన జస్టిస్ గవాయి చెట్ల నరికివేతకు
అనుమతి తీసుకున్నారా అని నిలదీసిన న్యాయమూర్తి తదుపరి ఆదేశాలు
ఇచ్చే వరకు ఒక్క చెట్టూ కూల్చవద్దని ఆదేశం హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలోని
ఫోటోలు అక్కడి పరిస్థితికి అద్దంపడుతున్నాయని వ్యాఖ్య ఉల్లంఘనలు
జరిగితే సిఎస్ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని స్పష్టీకరణ సిఎస్‌ను ప్రతివాదిగా
చేర్చిన సుప్రీం కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి
ఆదేశం సుమోటోగా కేసు నమోదు ఈ నెల 16 వరకు కేసు వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీ రుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీల క ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇ చ్చేంత వరకు అన్ని రకాల చర్యలు నిలిపివేయాల ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచ గ చ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం.. ఆ భూముల్లో ఎలాంటి పను లు చేపట్టొదంటూ స్టే విధించింది. సర్వోన్నత న్యా యస్థానం ఆదేశాల మేరకు గురువారం మధ్యా హ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు.
హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికలోని ఫొటోలు చూసి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పింది. వందల కొద్దీ యంత్రాలు మోహరించాల్సిన అగత్యం ఏంటో అర్థం కావడం లేదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి వార్తా కథనాలను అమికస్ క్యూరీ.. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సిఇసి అనుమతి తీసుకున్నారా..? అని నిలదీసింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. తమ ప్రశ్నలకు సిఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొవచ్చారు. అటవీ భూమి (ఫారెస్ట్ ల్యాండ్) అని ఆధారాలు లేవని న్యాయస్థానానికి తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
16కు వాయిదా : కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ప్రభుత్వం మార్చి 15న వేసిన కమిటీలోని అధికారులు కూడా జవాబు చెప్పాలని ఆదేశించింది. ఉల్లంఘనలు జరిగితే సిఎస్ వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుపుతూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టులోనూ విచారణ : మరోవైపు కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సియు విద్యార్థులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం కూడా విచారణ జరిగింది. బుధవారం రోజున ఒకరోజు పనులు ఆపాలని ఆదేశించిన ధర్మాసనం ఈనెల 7 వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించింది.
హెచ్‌సియులో కలియతిరిగిన హైకోర్టు రిజిస్ట్రార్
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం హైకోర్టు రిజిస్ట్రార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను పరిశీలించారు. దాదాపుగా ఐదు కిలోమీటర్ల కాలినడకన పర్యటించి వివరాలు సేకరించారు. దాదాపు నాలుగైదు గంటల పాటు రిజిస్ట్రార్ హెచ్‌సియు భూములకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు రిజిస్ట్రార్‌ను కలిసి వర్సిటీలో ధ్వంసమైన భూమిని చూపించారు. అన్ని వివరాలు సేకరించి విశ్లేషించి హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించారు. మధ్యాహ్నం రిజిస్ట్రార్ యూనివర్సిటీ నుండి తిరిగి వెళ్లగానే పోలిసులు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి ఎవ్వరిని వెళ్లకుండా అడ్డుకున్నారు.