Sunday, December 22, 2024

బుల్డోజర్ జస్టిస్‌కు బ్రేక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నేరాలకు పాల్పడినట్టు అనుమానిస్తున్న వారి ఇళ్లు, నిర్మాణాలను బుల్డోజర్ జస్టిస్ పేరుతో కూల్చివేయడంపై సు ప్రీం కోర్టు అక్టోబర్ 1 వరకు స్టే విధించింది. ఇదే సమయంలో అనధికారిక నిర్మాణాలను కూల్చి వేయడానికి ఇలాంటి అనుమతులేవీ అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు న్యా యమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అక్టోబర్ 1 వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. త దుపరి తేదీ వరకు కోర్టు అనుమతి తీసుకోకుండా కూల్చివేతలు చేపట్టకూడదని, అయితే బహిరంగ వీధులు, ఫుట్‌పాత్‌లు, రైల్వేలైన్లు, బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక నిర్మాణాలకు ఈ ఉత్తర్వు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేట్ ఆస్తుల పైకి బుల్డోజర్లను నడిపించే

విషయంలో బాధితులకు ఉపశమనం ఇవ్వడం, దేశ స్థాయిలో మార్గదర్శకాల తయారీపై మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. మరోవైపు వీటిని ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యమవుతుందన్న ప్రభుత్వ భయాలను కొట్టి పారేసింది. చట్టపరమైన, శిక్షార్హమైన చర్యల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను, దుకాణాలను బుల్డోజింగ్ చేయకుండా నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం , రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పటికే సెప్టెంబర్ 2 వ తేదీన జరిగిన విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఈ బుల్డోజర్ జస్టిస్‌ను తీవ్రంగా తప్పుపట్టింది. దేశ వ్యాప్తంగా కూల్చివేతలపై మార్గదర్శకాలు అవసరం అని పేర్కొంది. ఈ నెలలో ఇప్పటికే రెండుసార్లు వివిధ రాష్ట్రాలు చేపట్టిన బుల్‌డోజర్ చర్యలపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాక్టీస్‌ను హీరోయిజంగా చూపే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. తమ అనుమతులు లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని తేల్చి చెప్పింది.

దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది. మహారాష్ట్ర,ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈసీకి నోటీసులు ఇస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రాష్ట్రాల్లో చాలాచోట్ల బీజేపీ అధికారంలో ఉంది. ఈ కేసులో ప్రధాన పిటిషనర్‌గా జామత్ ఉలేమా హింద్ వ్యవహరిస్తోంది. కూల్చివేతలకు ముందు కనీసం 4060 రోజుల ముందుగా నోటీసులు జారీ చేయాలని, చట్టవ్యతిరేక కూల్చివేతలకు సదరు అధికారులను బాధ్యులను చేయాలని ఆ సంస్థ సుప్రీంకు నివేదించింది. యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పుపై తుషార్ మెహతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కూల్చివేతలు చట్ట విరుద్ధమని, ఒక సామాజిక వర్గాన్నే లక్షంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారనే వాదన పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ వాదనలు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలియజేశారు. ఇప్పటివరకు కూల్చిన వాటిలో ఏది అసంబద్ధంగా కూల్చివేశారో ఒక ఉదాహరణ ఇవ్వాలని, అసలు కారణాన్ని తాము వెల్లడిస్తామని మెహతా చెప్పారు.

చట్టవిరుద్ధమైన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిన తరువాతే కూల్చివేతలు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సీయూసింగ్, ఎంఆర్ శంషాద్, ఎస్‌జీ వాదనలను ఖండించారు. అక్రమ కూల్చివేతలు కొనసాగుతున్నాయని, సమస్య తీవ్రంగా ఉందని కోర్టుకు తెలియజేశారు.ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News