న్యూఢిల్లీ: సహజీవనాలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం తన అసహనం వ్యక్తంచేసింది. సహజీవన సంబంధాలను రిజిస్ట్రేషన్ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించాలంటూ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా పిటిషనర్‌పై ‘ఇది తెలివి తక్కువ ఆలోచన’ అని మండిపడింది. ఇలాంటి పిల్స్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేస్తే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహా, జెబి. పార్థివాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయాన్ని వెల్లడించింది.
న్యాయవాది మమతా రాణి తన పిటిషన్ ద్వారా సహజీవన సంబంధాలను రిజిస్ట్రేషన్ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించేలా ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా అఫ్తాబ్ పూనావాలా తన సహజీవన భాగస్వామి శ్రద్ధవాకర్‌పై కిరాతకంగా వ్యవహరించడాన్ని ఉదాహరించారు. సహజీవన రిజిస్ట్రేషన్ వల్ల సహజీవనం చేసే వ్యక్తుల పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటుందని, దానివల్ల అత్యాచారాలు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సహజీవనం చేసే వ్యక్తులకు దీని ద్వారా భద్రత కల్పించాలని చూస్తున్నారా? లేక ఇలాంటి బంధాలు ఎవరూ పెట్టుకోవద్దని చెప్పాలనుకుంటున్నారా? అని నిలదీసింది. తర్వాత పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.