Monday, March 10, 2025

అడ్‌హాక్ జడ్జీల నియామకానికి సిఫార్సులకు కేంద్రం నిరీక్షణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుదల దృష్టా హైకోర్టుల్లో అడ్‌హాక్ న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చి నెలపైనే కాగా కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థుల పేర్లతో ఆయా హైకోర్టుల నుంచి ఇంకా ప్రతిపాదనలు అందలేదు. 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండడాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుని తమ మంజూరు సంఖ్యలో పది శాతానికి మించకుండా అడ్‌హాక్ న్యాయమూర్తులను నియమించుకోవడానికి హైకోర్టులకు సుప్రీం కోర్టు జనవరి 30న అనుమతి ఇచ్చింది. కేసుల పెండింగ్‌ను తట్టుకోవడానికి హైకోర్టుల్లో అడ్‌హాక్ జడ్జీలుగా విశ్రాంత న్యాయమూర్తుల నియామకానికి రాజ్యాంగంలోని 224ఎ అధికరణం అనుమతిస్తోంది.

అడ్‌హాక్ జడ్జీల నియామకం నిమిత్తం ఆయా హైకోర్టు (హెచ్‌సి) కొలీజియాల నుంచి ఎటువంటి సిఫార్సూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు అందలేదని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. నిర్దేశిత ప్రక్రియ ప్రకారం, హెచ్‌సి జడ్జీలుగా నియామకానికి అభ్యర్థుల పేర్లతో ఆయా హైకోర్టు కొలీజియాలు సిఫార్సులను న్యాయ మంత్రిత్వశాఖలోని జస్టిస్ విభాగానికి పంపుతాయి. ఆ సిఫార్సులను సుప్రీం కోర్టు కొలీజియానికి పంపే ముందు అభ్యర్థులకు సంబంధించిన ఇతర వివరాలను ఆ విభాగం చేరుస్తుంది. ఆ తరువాత ఎస్‌సి కొలీజియం తుది నిర్ణయం తీసుకుని, ఎంపిక చేసిన వ్యక్తులను న్యాయమూర్తులుగా నియమించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. కొత్తగా నియుక్తుడైన జడ్జీ ‘నియామక పత్రం’పై రాష్ట్రపతి సంతకం చేస్తారు. అడ్‌హాక్ జడ్జీల నియామకం ప్రక్రియ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే నియామక పత్రంపై రాష్ట్రపతి సంతకం చేయరు. కానీ, అడ్‌హాక్ జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదాన్ని కోరతారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News