Thursday, January 23, 2025

ఆశ్చర్యకరమైన తీర్పు!

- Advertisement -
- Advertisement -

దొంగలు పడిన ఆరు మాసాలకు కుక్క అరిచిందని సామెత. అలాగే పెద్ద నోట్ల రద్దు జరిగిన యేడు సంవత్సరాలకు యెంతో తీరిగ్గా నిన్న సోమవారం నాడు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువడింది. అయిదుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు న్యాయ మూర్తులు నోట్ల రద్దుకు అనుకూలం గాను, వొకరు వ్యతిరేకంగాను తీర్పు వెలువరించారు, ఆ విధంగా ఈ తీర్పు నోట్ల రద్దు చర్యను సమర్థించింది. దేశ చరిత్రలో అదొక దుర్దశగా భావించి మౌనంగా బాధపడిన వారంతా ఈ తీర్పు వార్త విని న్యాయం జరగలేదంటూ ఆవేదనకు గురి అవుతారు, ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల ( 500,1000 రూపాయల నోట్లు ) రద్దును ప్రకటించినప్పుడు దేశప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ వద్దగల నోట్లను సమర్పించి వాటి విలువను కాపాడుకోడానికి బ్యాంకుల ముందు మైళ్లకు మైళ్ల డూరం బారులు తీరారు. దేశావ్యాప్తంగా ఆ క్యూలల్లో గంటల తరబడి నిలబడి నిస్సత్తువ ఏర్పడి మరణించిన వారి సంఖ్య కనీసం 200 వరకు వుంటుందని అనధికార అంచనాలు వెలువడ్డాయి.

చేతిలో చిల్లిగవ్వ కొరవడి చిన్న చితక వ్యాపారులు దుకాణాలు మూసుకొన్నారు. అప్పటివరకు ఉనికిలో ఉన్న కరెన్సీలో 86శాతం రద్దయిపోడం జనజీవనంలో యెటువంటి కల్లోలాన్ని సృష్టించిందో ఊహించవచ్చు. పెళ్లిళ్లు జరుపడానికని భద్రపరచుకొన్న సొమ్మువున్న పళంగా పైసాకు కూడా చెల్లకపోడంతో ఆత్మహత్యలను ఆశ్రయించిన కుటుంబాలున్నాయి. అత్యధికులుగావున్న పేద, దిగువ మధ్య తరగతుల ప్రజలు చెప్పనలవికాని బాధలు పడ్డారు. దేశం నుంచి అవినీతిని, నల్లడబ్బును, దొంగనోట్లను, టెర్రరిజాన్ని తరిమి కొట్టడానికే పెద్ద నోట్లను రద్దు చేయదలచినట్టు ప్రధాని మోడీ ఆరోజు దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం లో చెప్పారు.అప్పటికి చలామణీలో గల 3-4 లక్షల కోట్ల నల్ల డబ్బును నిర్మూలించడానికి పెద్ద నోట్ల రద్దును ఉద్దేశించినట్టు ప్రభుత్వం చెప్పుకొన్నది. ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా జరిగి సాధారణ ప్రజల బతుకులను తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టివేసింది.

చలామణిలో గల లక్షలాది కోట్ల రూపాయల నల్ల ధనాన్ని నిర్మూలించడానికి నోట్ల రద్దును ఉద్దేశించినట్టు ప్రభుత్వం చెప్పింది అది జరగకపోగా నల్లధనం దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. 99శాతం నల్ల డబ్బు చట్టబద్ధ కరెన్సీగా మారిపోయిందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. కొత్తది పెరుగుతున్నది. అసలు మొత్తం నల్ల ధనం నగదు రూపంలో ఉండబోదని 5శాతం మినహా మిగిలినదంతా ఆస్తుల రూపంలోకి మారిపోతుందని ఆర్ధిక వేత్తలు చెబుతూనే వచ్చారు. నోట్ల రద్దు ద్వారా రూ.15.41 లక్షల కోట్ల విలువైన ధనాన్ని నిరూపయోగం చేయగా అందులోని రూ 15.31 లక్షల కోట్ల కిమ్మత్తు నోట్లు తిరిగి సురక్షితంగా తెల్లధనంగా బ్యాంకులకు చేరుకొన్నదని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అలాగే దొంగనోట్లను నిర్మూలించడంలో కూడా నోట్ల రద్దు విఫలమయింది.నగదు రహిత లావాదేవీలు పెంచాలన్న లక్ష్యమూ నెరవేరలేదు.

పెద్ద నోట్ల రద్దు వల్ల నగదు ప్రధానమైన వ్యవసాయం, మత్స్య పరిశ్రమ వంటి రంగాలు యింకా చిన్న చితక ఉపాధి వ్యాపకాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అన్ని విధాలుగా ప్రజా జీవనాన్ని తీవ్రంగా దెబ్బ తీసిన పెద్ద నోట్ల రద్దును ఘనంగా చెప్పుకోడం ఆతర్వాత కొన్నాళ్ళకి మోడీ ప్రభుత్వమే మానుకొన్నది. ఇంతకాలం తర్వాత సుప్రీం కోర్టు ఆ చర్యలో తప్పు ఏమీ లేదని చెప్పడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఎన్నికల్లో ఘనంగా చెప్పుకోడానికి పాలకపక్షానికి యిది బాగా ఉపయోగపడుతుంది. న్యాయమూర్తులు బి ఆర్ గవాయి, ఎస్ ఎ నజీర్, ఎ ఎస్ బోపన్న, వి రావు సుబ్రహ్మణియన్ లు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సక్రమమయినదేనని తీర్పు చెప్పగా ధర్మాసనంలోని మిగిలిన వొకే వొక్క న్యాయమూర్తి నాగరత్న భిన్నమైన తీర్పు చెప్పారు. మెజారిటీ తీర్పుతో విభేదించారు.నోట్ల రద్దు విధానాన్ని ప్రకటించాల్సింది రిజర్వు బ్యాంకు సెంట్రల్ బోర్డు మాత్రమేనని, ప్రభుత్వం కాదని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్ అభిప్రాయం తెలుసుకోకుండా యీ నిర్ణయాన్ని ప్రకటించారని అభ్యంతరం తెలిపారు.

కేవలం నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం చట్టవిరుద్ధమన్నారు. ఈ విషయంలో రిజర్వు బ్యాంకు సొంతంగా స్వతంత్రంగా బుద్ధి పెట్టలేదని ఆక్షేపించారు.ఈ చర్య లక్ష్యాన్ని తాను ప్రశ్నించడం లేదని దానిని అమలు చేసిన తీరు చట్ట వ్యతిరేకమన్నారు, న్యాయ చరిత్రలో చెడ్డదని చెప్పారు. పెద్దనోట్ల రద్దువల్ల ఆర్ధిక వ్యవస్థకు స్థూల దేశీయోత్పత్తిలో 1.5 శాతం అంటే రూ.2లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. నిపుణులు స్పష్టంగా వ్యతిరేకంచారు. ప్రజలు నానా యాతనలు పడ్డారు. సుప్రీం కోర్టు మాత్రం వీలైనంత ఆలస్యంగా యిచ్చిన తీర్పులో పెద్ద నోట్ల రద్దు చర్యను సమర్థించింది. ఈ తీర్పు వల్ల ఏమీ జరగకపోయినా పాలకుల ముళ్ల గద వంటి అసంబద్ధ ఆర్ధిక నిర్ణయాన్ని దేశఅత్యున్నత న్యాయస్థానమే సమర్థిస్తే సామాన్యజనానికి దిక్కెవరు అనేప్రశ్న భయపెడుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News