Monday, December 23, 2024

కఠోర చట్టానికి కళ్లెం!

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession  రాజద్రోహ చట్టం అమలును నిలిపివేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువల పట్ల అరుదుగా అది ప్రకటించుకున్న విధేయతకు తిరుగులేని నిదర్శనం. ఇందుకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఎంతైనా అభినందించాలి. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124ఎ రూపంలో 152 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ రాజరిక నిరంకుశ చట్టాన్ని రద్దు చేయడానికే మొదట్లో సుప్రీంకోర్టు సిద్ధపడింది. ఈ చట్టం రద్దును కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించడానికి ఒక రోజు ముందు ఇటీవల కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. అందుకు తొలి స్పందనలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని గట్టిగా సమర్థించింది. ఎక్కడో, ఎవరో దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మొత్తం చట్టాన్ని రద్దు చేయడం తగదని అభిప్రాయపడింది. అలాగే 1962లో కేదార్ నాథ్ సింగ్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ చట్టం కొనసాగాలని తీర్పు ఇచ్చింది గనుక దానిని రద్దు చేయదలచేటప్పుడు మళ్లీ అదే స్థాయి ఐదుగురు జడ్జీల ధర్మాసనం పరిశీలనకు నివేదించాలని కూడా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఆ తర్వాత తన వైఖరిని స్వల్పంగా మార్చుకొని ఈ చట్టంపై సమీక్షకు తానే ఒక కమిటీని నియమిస్తానని, అంత వరకు దానిపై అంతిమ నిర్ణయాన్ని తీసుకోవద్దని సుప్రీంకోర్టును కోరింది. దానితో ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం రాజద్రోహ చట్టం అమలుపై స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ సమీక్షించి నిర్ణయం ప్రకటించే వరకు ఈ స్టే అమల్లో వుంటుంది. పర్యవసానంగా ఈ చట్టం కింద కేసులు దాఖలైన వ్యక్తులు విడుదలను కోరవచ్చు. దీని కింద ప్రభుత్వాలు కొత్త కేసులను దాఖలు చేయలేవు. నేరం నిర్ధారణ అయితే మూడేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు విధించడానికి ఈ చట్టం అవకాశమిస్తుంది. 1870లో బ్రిటిష్ వలస పాలకుల హయాంలో శిక్షాస్మృతిలో చేరిన రాజద్రోహ చట్టం వాస్తవానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి, ప్రజాస్వామిక రాజ్యాంగం అవతరించినప్పుడే అంతరించి వుండవలసింది. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పై, తిలక్ పై ప్రయోగించిన ఈ చట్టాన్ని ప్రజాస్వామ్య పాలకులు కూడా తమ వ్యక్తిగత అహంకారాన్ని, అధికార దర్పాన్ని సంతృప్తిపరచుకోడం కోసం కొనసాగిస్తూ వచ్చారు.

మొట్టమొదటి రాజ్యాంగ సవరణలో దీనికి జనహితం కోసం అనే పదాలను చేర్చి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. జనహితం కోసం రాచరిక చట్టాన్ని కొనసాగించాలనుకోడమే అసంబద్ధం. మొత్తానికి అకారణంగా అసంఖ్యాక అమాయకులను, ప్రజాస్వామిక చైతన్యవంతులను, అదేమని ప్రశ్నించిన వారిని, పాలకుల గొంతుకు అడ్డంపడిన వారిని అదే పనిగా ఈ చట్టం కింద అరెస్టు చేసి అనేక కష్టాలు పాలు చేసిన తర్వాత అత్యంత ఆలస్యంగానైనా దీనిని స్తంభింప చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం సంతోషించవలసిన విషయం. కేంద్ర ప్రభుత్వ కమిటీ ఈ చట్టంపై సమీక్షలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఆ తర్వాత దాని మీద సుప్రీంకోర్టు వైఖరి ఎలా వుంటుందో భవిష్యత్‌లో తెలుస్తుంది. వ్యక్తుల స్వేచ్ఛను గౌరవిస్తూ రాజ్యాంగం ఒకటికి రెండు సార్లు స్పష్టంగా వ్యక్తమైంది. 19వ అధికరణ భావ ప్రకటన స్వేచ్ఛకు సంపూర్ణ అవకాశం ఇస్తున్నది. అలాగే వ్యక్తి స్వేచ్ఛ, జీవన స్వేచ్ఛలకు రాజ్యాంగం 21వ అధికరణ తిరుగులేని రక్షణ కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారంలో వున్న వారు ధిక్కారముల్ సైతుమే అంటూ ప్రజలపై ఇటువంటి నిరంకుశ చట్టాలను ప్రయోగించడానికి ఎంత మాత్రం వీల్లేదు. రాజ్యం, ప్రభుత్వం, పాలకులు ఒకటి కాదు. పాలకులకు వ్యక్తిగతంగా ఆగ్రహం తెప్పించడాన్ని ప్రభుత్వ వ్యతిరేకతగా గాని, రాజ్య వ్యతిరేకతగా గాని పరిగణించడం బొత్తిగా తగదు.

దురదృష్ట వశాత్తు మన పాలకులు ఈ వ్యత్యాసాన్ని గమనించడం లేదు. అందుచేతనే రాజద్రోహ చట్టం లెక్కలేనన్ని సార్లు దుర్వినియోగమైంది. తాజాగా ప్రఖ్యాత జర్నలిస్టు వినోద్ దువా మీద కూడా దీనిని ప్రయోగించగా సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రాజద్రోహ చట్టం తాత్కాలికంగా తెర వెనుకకు వెళ్లిపోయింది కాబట్టి ప్రజల మీద అటువంటి కత్తి వేరేమీ వేలాడడం లేదని అనుకుంటే పొరపాటే. ఉగ్రవాదాన్ని అరికట్టే పేరిట చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధ (ఉపా: యుఎపిఎ) చట్టం, సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం వంటివి పాలకుల చేతిలో యమపాశాలుగా ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ప్రశ్నించే వారిని, ప్రజల తరపున ఉద్యమించే వారిని వీటి కింద జైళ్లలో తోస్తూ ఏళ్ల తరబడి విచారణ, జామీను వంటివి లేకుండానే కొనసాగిస్తున్నారు. వాటిని కూడా రద్దు చేసి అటువంటి మరే చట్టమూ కొత్తగా పుట్టుకు రాకుండా చూసినప్పుడే ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది. రాజద్రోహ చట్టానికి పూర్తిగా స్వస్తి చెప్పలేమా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News