న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ద్వారా వెంటనే విడాకులు ఇచ్చే పద్ధతిని శిక్షార్హమైన నేరంగా చేస్తున్న 2019 చట్టంలోని కొన్ని నిబంధనల చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన తాజా పిటిషన్‌ను కోర్టు ముందు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో చేర్చాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ చట్టం ఉల్లంఘన మూడు సంవత్సరాల పాటు జైలు శిక్షకు దారి తీస్తుంది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో పాటు ఈ పిటిషన్‌ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పర్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఆ పిటిషన్లపై కేంద్రానికి 2019లోనే నోటీసులు జారీ చేయడమైంది.
ఉత్తర ప్రదేశ్ ఆజమ్‌గఢ్ వాసి అమీర్ రషది మదానీ తాజా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై కొద్ది సేపు విచారణ జరిగినప్పుడు చట్టం నిబంధనలు పురుషుల హక్కులను ఏవిధంగా ఉల్లంఘిస్తున్నాయని సిజెఐ అడిగారు. 2019 నాటి ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం నిబంధనలు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరపూరితం చేస్తున్నాయని, పురుషులకు శిక్ష విధించే అవకాశం కల్పిస్తున్నాయని మదానీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. చట్టంలోని 3, 4 సెక్షన్లు పరస్పర విరుద్ధాలని న్యాయవాది అన్నారు. ఆ తరువాత పూర్వపు పిటిషన్లతో తాజా పిటిషన్‌ను కలపాలని బెంచ్ ఆదేశించింది.