Saturday, November 23, 2024

ఇసికి సుప్రీం పాఠం

- Advertisement -
- Advertisement -

Supreme Court tells EC we can’t gag media

 

మంచి, మన్నన, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోడం, పెద్దరికాన్ని గుర్తించి నెత్తిన పెట్టుకోడం అనేవి అంతా సవ్యంగా, సాఫీగా సాగుతున్నప్పుడే. పరిస్థితి చేయి దాటిపోయి ఒక మహా ప్రళయం ప్రాణాలను పెద్ద ఎత్తున కబళిస్తుంటే తగిన నివారణ విధులు నిర్వర్తించకుండా నిర్లక్షం వహించే వ్యక్తులు గాని, సంస్థలు గాని ఎంతటి వారైనా, ఎంత గొప్ప రాజ్యాంగ హోదాలు కలిగినవైనా ప్రజాగ్రహానికి, కోర్టుల న్యాయాగ్రహానికి గురి కావలసిందే. ప్రజా ప్రయోజనమనే చెలియలి కట్టను గౌరవించకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తూ ఉంటే విమర్శించే వారిని తప్పు పట్టే హక్కు అధికారం వారికి గాని, వాటికి గాని ఉండవు. ఘోరమైన కరోనా వేళ ప్రచార సభలను అడ్డుకోనందుకు తనను తప్పు పడుతూ మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇటీవల చేసిన ఘాటైన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తికి గురైన కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం, సుప్రీం ధర్మాసనం తిరిగి సిఇసికే బుద్ధి చెప్పినంత పని చేయడం గమనార్హం. ఎన్నికల సంఘం అధికారులపై హత్య కేసు పెట్టినా తప్పులేదని సంబంధిత కేసు విచారణ సందర్భంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అది యధాతథంగా మీడియాలో వచ్చింది.

దీనిని సిఇసి తప్పు పట్టింది. ధర్మాసనాలు ఇచ్చే తీర్పులను మాత్రమే ప్రజల దృష్టికి మీడియా తేవాలని, విచారణ సందర్భంలో జడ్జీలు చేసే వ్యాఖ్యలను ఎంత మాత్రం బయట పెట్టరాదని సిఇసి వాదించింది. సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ముందు అది ఈ విషయంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. హద్దూ అదుపూ లేని ప్రచార సభలకు అనుమతించిన ఎన్నికల సంఘమే కొవిడ్ మహా వ్యాప్తికి ఏకైక బాధ్యురాలని, దానిపై హత్య కేసు నమోదు చేయవచ్చని న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గత 30వ తేదీన దాఖలు చేసిన పిటిషన్‌లో మద్రాస్ హైకోర్టును సిఇసి అర్థించింది. కాని హైకోర్టు న్యాయమూర్తులు అందుకు ససేమిరా అంగీకరించలేదు. దానితో ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను బయటకు చెప్పకుండా మీడియాను నిరోధించడం సబబు కాదని అది అసాధ్యమని న్యాయమూర్తులు చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

న్యాయమూర్తుల వ్యాఖ్యలను నిజాయితీగా, పరిపూర్ణంగా బహిర్గతం చేయడం ద్వారా మీడియా ఆయా కేసుల పరిష్కారానికి జడ్జీలు మనసు పెట్టి పని చేస్తున్నారో లేదో ప్రజల దృష్టికి తెస్తున్నదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజా ప్రయోజనం కేవలం తీర్పులతోనే ముడిపడి ఉండదని, విచారణ సమయంలో న్యాయమూర్తులు ప్రశ్నించడం, న్యాయవాదులకు, ధర్మాసనానికి మధ్య సాగే సంభాషణలు కూడా ముఖ్యమేనని వివరించింది. హైకోర్టు తన వంటి మరో రాజ్యాంగ సంస్థ అయిన సిఇసిపై హత్యారోపణ చేయడం తగదని ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించగా, జడ్జీలలో కఠినంగా స్పందించేవారు, సౌమ్యంగా మాట్లాడేవారు ఉంటారని, కొవిడ్ కనీవినీ ఎరుగని ప్రాణపాయ స్థితిని కలిగించి విలయ తాండవం చేస్తున్నప్పుడు న్యాయమూర్తుల వ్యాఖ్యల్లో జనాగ్రహం ప్రతిధ్వనించడం సహజమని, అటువంటి తీవ్ర అసంతృప్తి నుంచే వారి వ్యాఖ్యలు ఊడిపడతాయని అవి విశాల ప్రజా హితం కోసం చేసినవేనని సుప్రీం ధర్మాసనం అన్నది.

హైకోర్టులు బాధ్యతగా వ్యవహరిస్తున్న తీరును మెచ్చుకున్నది. అదే సమయంలో మీడియా ప్రజాస్వామ్య పవిత్రతను పరిరక్షించే అతి ముఖ్యమైన కాపలాదారని అభిప్రాయపడింది. కొవిడ్ నివారణ చర్యలు తీసుకోడం తన బాధ్యత కాదని, అది ప్రభుత్వం చేయవలసిన పని అని కేంద్ర ఎన్నికల సంఘం ఈ కేసులో వాదించినట్టు వార్తలు చెబుతున్నాయి. శాంతి భద్రతల పేరిట బెంగాల్‌లో పోలింగ్‌ను 8 విడతలలో జరిపించిన ఎన్నికల సంఘం కొవిడ్ వ్యాప్తి వల్ల ప్రజలకు ప్రాణాంతక పరిస్థితి తలెత్తుతుందనే తెలివిడితో ప్రచార సభలపై తగిన పరిమితులను విధించవలసిన బాధ్యతను ఎందుకు గుర్తించలేదనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతున్నది. పార్లమెంటుకు, శాసన సభలకు, భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు ఎన్నికలు సవ్యంగా, నిర్భయ నిష్పాక్షిక వాతావరణంలో జరగడానికి వీలుగా ఎటువంటి చర్యలనైనా తీసుకునే అధికారాలు సిఇసికి ఉన్నాయి. ఎన్నికల నిర్వహణపై సిఇసికి అన్ని అధికారాలూ ఉన్న సంగతిని రాజ్యాంగం 324 అధికరణ స్పష్టం చేస్తున్నది.

వాటిని తన ఇష్టావిలాసంగా వినియోగించిన మాజీ సిఇసి టిఎన్ శేషన్ ఉదంతం ఉండనే ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, అది మెరుగుపడడానికి అనువుగా ఎన్నికలను లోపరహితంగా జరిపించడంలో భాగమే కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని తీసుకోదగిన చర్యలు. ఈ బాధ్యతను గమనించి తగు విధంగా వ్యవహరించడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందనే విషయం సుప్రీంకోర్టు అభిప్రాయాల అద్దంలో కూడా ప్రస్ఫుటమవుతున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News