న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు సంబంధించి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్టార్ రెజ్లర్లు వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం ప్రకటించింది. రెజ్లర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చండ్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్వీకరించింది. దీనిపై ఈ నెల 28న(శుక్రవారం) విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది. రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవేనని, దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
అంతేగాక ఈ కేసులో ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు జ్యుడిషియల్ రికార్డుల నుంచి ఆ ఏడుగురు రెజ్లర్ల పేర్లను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇదిలావుంటే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై భారత్‌కు చెందిన పలువురు స్టార్ రెజ్లర్లు లైంగిక వేధింపులకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, సాక్షిమలిక్ తదితరులు బ్రిజ్ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా రెజ్లర్లు తమ నిరసనను కొనసాగించారు.