Friday, December 20, 2024

అదానీ సంస్థలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అర్జంట్‌గా విచారించాలని కోరుతూ అడ్వొకేట్ విశాల్ తివారీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు గురువారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. న్యాయమూర్తులు పి.ఎస్. నర్సింహ, జెబి. పార్దివాలా తో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను వేశారు. కాగా విచారణ శుక్రవారం(ఫిబ్రవరి 10)న విచారణ జరుగనున్నది. ‘రేపు ఇలాంటి పిటిషనే విచారణకు రానున్నది. ఆ పిటిషన్‌తోపాటు తన పిటిషన్‌ను కూడా విచారించాలి’ అని విశాల్ తివారీ కోరారు. దానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘సరే’ అన్నారు.

తివారీ తన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)లో ‘పెద్ద కార్పొరేట్లకు రూ. 500 కోట్లకు పైగా రుణం ఇచ్చిని పాలసీని చూసేందుకు ఓ ప్రత్యేక కమిటీని వేసేలా ఆదేశించాలి’ అని కోరారు. గతవారం అడ్వొకేట్ ఎం.ఎల్.శర్మ కూడా సుప్రీంకోర్టులో ఓ పిల్‌ను వేశారు. అందులో ఆయన మార్కెట్‌లో అదానీ స్టాక్ విలువను కృత్రిమంగా కుప్పకూలేలా చేసిన అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు చెందిన షార్ట్ సెల్లర్ నాథన్ ఆండర్సన్‌ను విచారించాలని కోరారు. హిండెన్‌బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌కు చెందిన స్టాక్స్ విలువ గణనీయంగా పడిపోయిందన్నది తెలిసిన విషయమే. మోసపూరిత లావాదేవీలు, షేర్ ధర పెంచడం, తగ్గించడం(మ్యానిపులేషన్)కు అదానీ గ్రూప్ పాల్పడిందన్నది హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపణ. కానీ వాటినన్నిటినీ అదానీ గ్రూప్ అబద్ధాలు అని కొట్టిపారేసింది. ‘చాలామంది తమ జీవితాంతం చేసుకున్న పొదుపు డబ్బును అదానీ స్టాక్స్‌లో పెట్టారు. కాగా అదానీ షేర్లు తీవ్రంగా పతనమవ్వడంతో వారి డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరు చందంలా అయింది’ అని తివారీ తన పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపారు. అదానీ 10 కంపెనీల స్టాకుల విలువ సగానికి పైగా కరిగిపోయిందని కూడా ఆయన తెలిపారు. ‘దేశ ఆర్థికవ్యవస్థపై దాడి జరిగినా అధికారులు ఎలాంటి నివారణ చర్య తీసుకోలేదని, ప్రజా ధనానికి కేంద్రం, ఇతరులు చివరికి జవాబుదారులు. పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంలో జరిగే విధివిధానాలకు వారు జవాబుదారులు’ అని పేర్కొన్నారు. తివారీ తన పిటిషన్‌కు రెస్పాండెంట్స్‌గా (ప్రతివాదులుగా) కేంద్రం, భారత రిజర్వు బ్యాంకు సహా ఇతరులను చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News