11 వరకల్లా అఫిడవిట్‌కు ఆదేశాలు
న్యూఢిల్లీ: కొవిడ్19 వల్ల మరణించినవారి ధ్రువీకరణ పత్రాల జారీ, వారి కుటుంబాలకు పరిహారం చెల్లింపులపై మార్గదర్శకాలు రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని సుప్రీంకోర్టు అసంతృప్టి వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు రూపొందించేనాటికి మూడోవేవ్ కూడా ముగిసేలా ఉన్నదని చురకలంటించింది. కొవిడ్ మరణాలకు సంబంధించిన కేసులపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధబోస్ ధర్మాసనం శుక్రవారం విచారించింది. కొవిడ్‌తో మరణించినవారికి పరిహారం ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు జూన్ 30న మొదటి ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత అఫిడవిట్ సమర్పణకు గడువు తేదీని సెప్టెంబర్ 8కి పొడిగించింది. తాజా విచారణలో కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..కోర్టు ఆదేశాలన్నీ కేంద్రం పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. దాంతో, సెప్టెంబర్ 11లోగా అఫిడవిట్ సమర్పించాలని ధర్మాసనం మరోసారి ఆదేశించింది.