Wednesday, January 22, 2025

అనుచితాలా?

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రజలకు వాగ్దానం చేసే ‘ఉచితాల’కు తెర దించాలనే వాదన మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వొక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం నాడు తీవ్రంగా స్పందించింది. ఎన్నికలలో ఉచితాల ప్రకటనను అదుపు చేయవలసి వుందని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 3 నాటికి తగిన సూచనలతో రావలసిందని కేంద్రాన్ని ఆదేశించింది. ఎన్నికల్లో వోటర్లకు లంచంగా బరిలోని రాజకీయ పార్టీలు ప్రకటించే అనవసరమైన ఉచితాల వల్ల ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తింటున్నదని, రాష్ట్రాలు వీటిపై పెట్టే ఖర్చును బట్టి ఆదాయంలో వాటికి చేసే కేటాయింపులను క్రమబద్ధం చేయవచ్చునేమో ఆర్ధిక సంఘాన్ని అడిగి తెలుసుకొని చెప్పాలని కేంద్రానికి సూచించింది.

న్యాయవాది అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ వేసిన ప్రజాప్రయోజన కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని యీ విధంగా ఆదేశించింది. దేశం యిప్పటికే విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయిందని, ఉచితాలను అరికట్టకపోతే శ్రీలంక, గ్రీసు మాదిరిగా దివాలా తీస్తుందని పిటిషనర్ హెచ్చరించారు. ఖజానా దివాలా తీసేలా, అభివృద్ధి కుంటుపడేలా ఉచితాల కింద డబ్బు వెదజల్లడానికి, ఆదాయంలో కొంత భాగాన్ని సహేతుక సంక్షేమ పథకాల కింద ఖర్చు చేయడానికి తేడా వుంది. ఈ తేడాను గమనించకుండా వుచితాలను వూచకోత కోయాలనడం యెంత మాత్రం సమర్ధించదగినది కాదు. ఏ ఔషధమైనా మనిషిని బతికించాలే కాని చంపేయకూడదు. ఆర్ధిక వ్యవస్థను కాపాడాలనే సాకుతో నిరుపేదల ఆకలిని కూడా పట్టించుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆర్ధిక వ్యత్యాసాలు తీవ్రంగా వుండి అత్యధిక సంఖ్యాక ప్రజలు నోటికి చేతికి అందని దుస్థితిలో మగ్గుతున్న చోట వారి జీవితాలు మెరుగుపడడానికి తోడ్పడే ఉచిత పథకాలను పార్టీలు యెన్నికల్లో వాగ్దానం చేయడాన్ని మానవతా దృష్టితో అనుమతించక తప్పదు.

సామాజిక నిచ్చెనలో అట్టడుగున పడివున్న ఎస్‌సి, ఎస్‌టి వంటి వర్గాలు యే కొంచెం పైకి రాడానికి వుచితాలు ఉపయోగపడినా వాటిని ప్రయోజనకరమైనవిగానే పరిగణించాలి. పాలనకు యీ మానవీయ కోణం తప్పనిసరిగా వుండాలి. ఉచితాలకు పూర్తిగా తెర దించే విషయంలో యెన్నికల సంఘాన్ని తగు విధంగా ఆదేశించాలని పిటిషనర్ కోరడంతో సుప్రీం ధర్మాసనం ఇసి కి కూడా ఆదేశాలు జారీ చేసింది. మేనిఫెస్టోల్లో గాని, వాటి బయటగాని పార్టీలు, అభ్యర్థులు చేసే వుచిత వాగ్దానాలపై తమకు యెటువంటి అధికారం లేదని ఇసి స్పష్టం చేసింది. ఎన్నికల్లో యిచ్చే వుచిత హామీల వల్ల పార్టీల మధ్య సమాన పోటీ వాతావరణం దెబ్బ తింటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నది. ఇందులో కొంత వాస్తవమున్నప్పటికీ పోటీలోని అన్ని పార్టీలు వుచితాలను వాగ్దానం చేయడంలోనూ పోటీ పడతాయి.

ప్రజలు అన్ని పార్టీలను యెన్నుకోలేరు. వాటిలో తమకు యెక్కువ విశ్వాసమున్న పార్టీనే యెన్నుకొంటారు. ఉచితాలు యెన్నికల వాతావరణాన్ని కలుషితం చేస్తాయన్న సుప్రీం న్యాయస్థానమే జయలలిత ప్రభుత్వ వుచిత గృహోపకరణాల వాగ్దానం అమలుకు తీసుకొన్న నిర్ణయాన్ని కొట్టివేయడానికి నిరాకరించింది. ప్రస్తుత చట్టం మేనిఫెస్టోల్లో వాగ్దానాలను అవినీతి చర్యగా పరిగణించడం లేదన్న కారణం చూపింది. ఇప్పుడా చట్టాన్ని సవరింపజేయాలన్నది దాని వుద్దేశం అయి వుండవచ్చు. ధనికులు, పేదలు అనే తేడా లేకుండా అందరూ సమానంగా తమ జేబుల్లో నుంచి చెల్లించి ప్రతి అవసరాన్ని కొనుక్కోవాలని భావించేవారే ఉచితాలను వ్యతిరేకిస్తారు. అయితే సాగుకు నదీ జలాలు అందుబాటులో గల ప్రాంతాలకు, మెట్ట ప్రాంతాలకు మధ్య తేడాను తొలగించడం కోసం బోర్లకు వుచిత విద్యుత్తును హామీ యిచ్చి సరఫరా చేయడాన్ని ఆక్షేపించలేము. దానిని నిరర్ధక వుచితంగా తీసిపారేయలేము.

ఉచిత విద్యుత్తు వల్ల మెట్ట రైతుల జీవితాల్లో తీసుకు వచ్చే మంచి మార్పును యే అభివృద్ధి పధకమూ తేజాలదు. అలాగే ఉచితాలపై అన్ని రాష్ట్రాలను వొక్క గాటను కట్టవలసిన అగత్యం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలోని పంజాబ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగులేదు. అక్కడ ఉచితాల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసి వుంటుంది. అదే సమయంలో ఆప్ అధికారంలో గల ఢిల్లీలో పరిస్థితి యిందుకు భిన్నంగా వుంది. అక్కడ ఆదాయం గణనీయంగా వున్నందున 300 యూనిట్ల వరకు విద్యుత్తును వుచితంగా యిచ్చినా ఆ ప్రభుత్వం తట్టుకోగలుగుతున్నది. తెలంగాణ కూడా ఆర్ధిక సమృద్ధి గల రాష్ట్రం. ప్రజల అభివృద్ధి, సంక్షేమంకోసం పెట్టే ఖర్చును తట్టుకోగల శక్తి వున్న రాష్ట్రం. వుచిత సాగు విద్యుత్తు, రైతుబంధు, దళిత బంధు వంటి పథకాల ద్వారా ప్రజల రాబడిని పెంచి వారి జీవితాల్లో వెలుగులు ప్రసరించగలుగుతుంది.వాటి భారం ప్రభుత్వానికి అలవికానిది కాదని ఆర్ధిక నిపుణులు నిగ్గు తేల్చారు.అందుచేత ప్రజల కొనుగోలు శక్తిని పెంచే, వారి దుర్భర కష్టాలను పారద్రోలే సంక్షేమమూ సాటిలేని అభివృద్ధేనని గమనించాలి, సహేతుక వుచితాలను అనుమతించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News