Monday, December 23, 2024

బుల్డోజర్ న్యాయంపై సుప్రీం సీరియస్

- Advertisement -
- Advertisement -

బుల్డోజర్ చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీం కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తి కాజాలదని, నిందితుని దోషిగా తేల్చి, అతని ఆస్తులు కూల్చడం ద్వారా శిక్షించజాలదని, అటువంటి చర్య తన పరిధిని అతిక్రమించడమే అవుతుందని సుప్రీం కోర్టు సుస్పష్టం చేసింది. ఒక పౌరుడు నిందితుడు లేదా దోషి అయిన కారణంగా మాత్రమే, అందునా చట్టం నిర్దేశించిన ప్రక్రియను అనుసరించకుండా అతని ఇంటిని కూల్చివేయడం ఎన్నో విధాలుగా ‘పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం’ అని కూడా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుల్డోజర్ చర్యలపై తీర్పు వెలువరిస్తూ ఆ వ్యాఖ్యలు చేసింది. ఆస్తుల కూల్చివేతపై దేశవ్యాప్తంగా అనుసరించవలసిన మార్గదర్శక సూత్రాలను బెంచ్ ఈ తీర్పులో నిర్దేశించింది.

కార్యనిర్వాహక వర్గం ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించజాలదని, ఎందుకంటే ఆ ప్రక్రియ న్యాయవ్యవస్థ సమీక్షకు సంబంధించిన ప్రాథమిక అంశమని బెంచ్ సూచించింది. ‘ఆరోపణల ప్రాతిపదికపైనే కార్యనిర్వాహక వర్గం సరైన చట్ట ప్రక్రియను పాటించకుండానే అటువంటి నిందితుని ఆస్తిని/ ఆస్తులను కూల్చివేసినట్లయితే చట్టబద్ధ పాలన మౌలిక సూత్రాన్నే తోసిరాజంటుంది, అది అనుమతించదగినది కాదు’ అని బెంచ్ తన 95 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. కార్యనిర్వాహక వర్గం ఒక న్యాయమూర్తిగా వ్యవహరించి, నిందితుడు అనే కారణంగా ఒక పౌరునిపై కూల్చివేత పెనాల్టీని విధిస్తే అది ‘అధికారాల విభజన’ సూత్రాన్నే ఉల్లంఘించినట్లు అవుతుందని బెంచ్ అన్నది. ‘అటువంటి వ్యవహారాల్లో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రభుత్వ అధికారులను అటువంటి దుందుడుకు చర్యలకు జవాబుదారీ చేయాలి’ అని బెంచ్ స్పష్టం చేసింది. భవనం కూల్చివేతకు 15 రోజుల ముందు సదరు యజమానికి నోటీసులు ఇవ్వవలసిందేనని కోర్టు తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ విషయంలో మార్గదర్శకాలు పాటించవలసిందేనని కోర్టు సూచించింది. రిజిస్టర్ట్ పోస్ట్‌లో నోటీసులు పంపడంతో పాటు నిర్మాణం వెలుపల నోటీసులు అంటించాలని కోర్టు ఆదేశించింది.

ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేస్తున్నదీ స్పష్టమైన కారణం తెలిపాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. కూల్చివేతను వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. రాజ్యాంగ పరిరక్షణకు పౌర హక్కుల పరిరక్షణ చాలా అవసరమని సూచించిన ధర్మాసనం ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా చట్ట నియమాలు తప్పనిసరి అని, చట్టపరమైన ప్రక్రియ అటువంటి చర్యను క్షమించదని స్పష్టం చేసింది. ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో అతని ఎన్నో ఏళ్ల శ్రమ, కలలు కలగలసి ఉంటాయని, వారి భవిష్యత్తు, భద్రత కూడా అందులోనే ఉంటాయని కోర్టు తెలియజేసింది. నిందితుడు ఒక్కడే అయినప్పుడు ఆ ఇంటిలో నివసించే మిగిలినవారికి ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారని కోర్టు ప్రశ్నించింది. కార్యనిర్వహణ అధికారే న్యాయమూర్తి పాత్ర పోషించి చట్టాన్ని పాటించకుండా ఇంటి కూల్చివేతకు ఆదేశాలు ఇస్తే అది చట్టబద్ధ పాలనను ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.

కూల్చివేతల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల వేతనం నుంచి వసూలు చేస్తామని కోర్టు తెలిపింది. కూల్చివేతలకు సంబంధించి వెబ్‌సైట్‌లో నోటీసులను ప్రదర్శించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నోటీసులను రిజిస్టర్డ్ పోస్ట్‌లోనే పంపాలని కోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News