రాష్ట్రాల్లోని ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వ అధికారాలను కేంద్రం నిరంకుశంగా హరించజాలదని సుప్రీంకోర్టు ప్రకటించిన 2023 మే 11వ తేదీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో విశిష్టమైన దినంగా నిలిచిపోతుంది. ఢిల్లీపై అధికారాలు ముఖ్యంగా ప్రజలకు సేవలందించే వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల మీద, వాటి యంత్రాంగం మీద అదుపాజ్ఞలు ఎవరి వద్ద వుండాలనే అంశంపై ఎనిమిదేళ్ళుగా కేంద్రానికి, ఆప్ ప్రభుత్వానికి మధ్య నడిచిన వివాదానికి సుప్రీంకోర్టు గురువారం నాడు శాశ్వతంగా తెర దించింది. సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎంతో ఊరట కలిగించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలు, పోలీసు, భూమి వ్యవహారాలు మినహా మిగతా అన్ని సేవలపై అధికారం అక్కడ గల ఎన్నికైన ప్రభుత్వానికే చెందుతుందని ఆ విషయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ప్రభుత్వ మంత్రి వర్గ సిఫారసులకు లోబడి పని చేయాల్సి వుంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది.
ఇంత వరకు చీటికి మాటికి కేజ్రీవాల్ ప్రభుతానికి ముందరి కాళ్ళ బంధాలు బిగిస్తూ దాని నిర్ణయాలన్నింటినీ చెత్తబుట్టలో వేస్తూ కేంద్రంలోని బిజెపి పాలకులకు సేవ చేస్తూ వచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్ ఆటలు దీనితో పూర్తిగా కట్టు అయిపోయాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అనే సాకుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని నామమాత్రం చేస్తూ వచ్చిన ఎల్‌జి ఆగడాలకు తెర పడిపోయింది. ‘ప్రజాస్వామ్యమనేది రాజ్యాంగ మౌలిక స్వరూపమైన సమాఖ్య వ్యవస్థలో భాగం, ప్రయోజనపరమైన, అవసరాలకు సంబంధించిన వైవిధ్యాన్ని అది హామీ ఇస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం ప్రజలెన్నుకొన్నది కాబట్టి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని పెంపొందించవలసిన బాధ్యత దానిపై వుంటుంది’ అని ఈ కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన స్పష్టీకరణ శిరోధార్యమైనది.
ఢిల్లీ ప్రజలకు అందించే సర్వీసులను (సేవలను) శాసనపరమైన, కార్యనిర్వాహకపరమైన పరిధుల నుంచి తప్పిస్తే మంత్రులు, ప్రభుత్వ కార్యనిర్వాహక యంత్రాంగం గోళ్ళు గిల్లుకొని కూచోవలసి వుంటుందని ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో పరిపాలన విధానాల రూపకల్పన బాధ్యత కలిగిన ఈ రెండు వ్యవస్థలు ఆ ప్రభుత్వ నిర్ణయాలను అమలు పరిచే సివిల్ సర్వీసు అధికారులపై అదుపు కోల్పోతాయని సిజెఐ వెలిబుచ్చిన అభిప్రాయం ప్రజాస్వామ్య చైతన్యాన్ని పుణికిపుచ్చుకొన్నది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతి చిన్న, పెద్ద వ్యవహారంలో తలదూరుస్తూ అధికారులను నేరుగా తన వద్దకు రప్పించుకొని ఆదేశాలిస్తూ వచ్చేవారు. దానితో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏ విషయంలోనూ గట్టిగా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కొనసాగింది. పౌర సేవల విభాగాలపై తన ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేకపోడం పట్ల విసిగిపోయిన కేజ్రీవాల్ ఒక సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడుతూ ‘నేను ఎన్నికైన ముఖ్యమంత్రిని, ఎవరీ లెఫ్టినెంట్ గవర్నర్? ఎక్కడి నుంచి వచ్చాడు? నా తల మీద ఎందుకిలా కూచొని వేధిస్తున్నాడు?’ అని ప్రకటించారు.
ఎల్‌జి నా పాలిట ఒక హెడ్మాష్టర్‌గా తయారయ్యాడు, చిన్నప్పుడు నా టీచర్లు కూడా నా హోం వర్క్‌ను ఈ విధంగా తనిఖీ చేయలేదు అని వాపోయారు. ఆయనకిప్పుడు ఢిల్లీ పరిపాలన మీద (పోలీసు, భూ వ్యవహారాలు మినహా) పరిపూర్ణమైన స్వేచ్ఛ రావడం అతి గొప్ప పరిణామం. ఆయనకే కాదు ఇది దేశంలోని ప్రజలెన్నుకొనే ప్రాతినిధ్య ప్రభుత్వాలన్నింటికీ భరోసానిస్తున్న తీర్పు. ఈ వివాదం ప్రాథమికంగా 2014లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో గ్యాస్ ధరల నిర్ణయానికి సంబంధించి రిలయన్స్ ఇండియా లిమిటెడ్‌పై, ముకేశ్ అంబానీపై, అప్పటి యుపిఎ ప్రభుత్వ మంత్రులు వీరప్ప మొయిలీ, కీ.శే మురళీ దేవరాలపై ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ప్రారంభమైంది. ఈ ఛార్జిషీట్‌పై రిలయెన్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం కూడా కేజ్రీవాల్ ప్రభుత్వ చర్యను సవాలు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం పరస్పరం సవాలు చేసుకోడంతో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఒక దశలో 2016 జులై 27న ఢిల్లీ కేంద్రం అదుపులో వున్నదని అది పూర్తి స్థాయి రాష్ట్రం కాదని బిజెపి ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు నివేదించింది.
రెండు ప్రభుత్వాల వాదనలను విని తీర్పు చెప్పడానికి సుప్రీంకోర్టు 2017లో రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమించింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వతంత్రమైన నిర్ణయాధికారాలు లేవని ఢిల్లీ ప్రభుత్వ మంత్రివర్గ సిఫారసుల పైనే ఎల్‌జి నడుచుకోవాలని 2018 జులై 4న సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దానిపై కేంద్రం మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాదం ఇప్పటి వరకు సాగింది. రెండు చిన్న ధర్మాసనాలు వ్యవహారాన్ని ఇదమిత్థంగా తేల్చకపోడంతో సుప్రీంకోర్టు 2022 మేలో ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఈ తీర్పుతో ఢిల్లీ ప్రభుత్వం ఆ మూడు అంశాలు మినహా మిగతా అన్ని వ్యవహారాలపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో సమానమైన స్థాయికి చేరుకొన్నది. కేంద్రంలోని బిజెపి పాలకులు ఇకనైనా తమ అదుపాజ్ఞల్లోని లెఫ్టినెంట్ గవర్నర్ అనే జాగిలాన్ని గుంజకు కట్టి వుంచడం మంచిది.