Wednesday, December 25, 2024

పెద్దనోట్ల రద్దు సమర్థనీయమే: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ఆరేళ్ల క్రితం (2016లో) జరిగిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెజార్టీ తీర్పులో సమర్థించింది. ఆరు సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ నాయకత్వపు బిజెపి ప్రభుత్వం రూ.1000, రూ.500 వంటి పెద్దనోట్ల చలామణిని నిలిపివేస్తూ అర్థరాత్రివేళ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని సవాలు చేస్తూ దాఖలు అయిన దాదాపు 58 పిటిషన్లపై పలు దఫాల విచారణలు, కేంద్రం, ఆర్‌బిఐ నుంచి రాతపూర్వక వివరణలు తీసుకున్న తరువాత న్యాయమూర్తి ఎస్‌ఎ నజీర్ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4ః1 మెజార్టీ తీర్పును వెలువరించింది. పెద్దనోట్ల రద్దు విషయాన్ని తప్పుపట్టలేమని, ఈ విధాన నిర్ణయ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేవని ఈ భిన్నాభిప్రాయ తీర్పులో తెలిపారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని జస్టిస్ బివి నాగరత్న మెజార్టీ తీర్పుతో విభేదించారు.

అయితే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో లోపాలు లేవని తెలిపిన ధర్మాసనం దీనిని సక్రమమే అంటూ సమర్థించింది. కానీ పరోక్షంగా ఈ ప్రధాన విధాన నిర్ణయం సంబంధిత ద్రవ్య సంస్థలు ప్రత్యేకించి ఆర్‌బిఐ నుంచి వెలువడాల్సి ఉంది. కానీ ఇందుకు భిన్నంగా ప్రభుత్వం నుంచి ఈ పెద్ద నోట్ల రద్దు విధాన నిర్ణయం వెలువడ్డా లోపాలు ఎంచలేమని, లోపభూయిష్టంగా ఏదీ లేదని ధర్మాసనం పేర్కొంది. ఎక్కువ స్థాయి కరెన్సీ నోట్ల చలామణిని నిలిపివేయడంలో చట్టపరంగా కానీ రాజ్యాంగపరంగా కానీలోపాలు వంటి ఇబ్బందులు ఏమీ లేవని , ఆరు నెలల పాటు ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఈ నిర్ణయానికి సంబంధించి తగు సంప్రదింపులు జరిగినట్లు నిర్థారించామని తెలిపారు.

ఎక్సిక్యూటివ్ ఆర్థిక నిర్ణయానికి జుడిషియరీ చెక్ కుదరదు
దేశంలోని అధికారిక కార్యనిర్వాహక విభాగం ఎక్సిక్యూటివ్ తమ ఆర్థిక విధానంలో భాగంగా ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయవ్యవస్థ కాదనలేదు. అయితే ఏ వ్యవస్థ నిర్ణయాలకు దిగినా ఆర్థిక విధాన నిర్ణయాల విషయంలో పలు స్థాయిల్లో సంయమనం, నియంత్రణ అత్యవసరం అని ధర్మాసనం తెలిపింది. ఏది ఏమైనా న్యాయస్థానం ఇటువంటి అంశాలలో ఎక్సిక్యూటివ్ విజ్ఞతను జుడిషియల్ రివ్యూల ద్వారా కాదనలేదని స్పష్టం చేశారు. ఈ రాజ్యాంగ ధర్మాసన సారధ్య బాధ్యతలలో ఉన్న జస్టిస్ నజీర్ ఎల్లుండి ( 4వ తేదీ) రిటైర్ కానున్న దశలో రిజర్వ్ చేసి ఉన్న ఈ తీర్పు ఇప్పుడు వెలువరించారు. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్, న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, ఎఎస్ బొపన్న, వి రామసుబ్రమణియన్, బివి నాగరత్న సభ్యులుగా ఉన్నారు.

2016 నవంబర్ 8వ తేదీన పెద్దనోట్ల రద్దుకు సంబంధించి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తక్షణ నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ప్రభుత్వం నిర్ధేశిత లక్షాలను పెట్టుకుని ఉంటుంది, దీనికి అనుగుణంగానే సంబంధిత నిర్ణయం తీసుకుని ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. నల్లధనం వెలికితీత, ఉగ్రనిధుల ఏరివేత వంటి అంశాలు ఇమిడి ఉంటాయి. అయితే కేంద్రం ఎందుకైతే ఈ నిర్ణయాన్ని ఉద్ధేశించిందో ఆ లక్షం నెరవేరిందా? అనేది అప్రస్తుత అంశం అని ధర్మాసనం తెలిపింది. పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఏర్పాటు చేసిన నోట్ల మార్పిడికి సంబంధించిన 52 రోజుల విండో చట్టబద్ధం, అనుచితం ఏమీ కాదని, దీనిని ఇప్పుడు పొడిగించేందుకు వీల్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఆర్‌బిఐ యాక్ట్ సెక్షన్ 26(2)మేరకు కేంద్రానికి అధికారం
నోట్ల రద్దుకు సంబంధించి ఆర్‌బిఐ యాక్ట్ సెక్షన్ 26(2) మేరకు కేంద్రానికి అధికారాలు ఉన్నాయి. దీని మేరకు దక్కే పవర్‌ను కేవలం అన్ని సీరిస్‌ల నోట్లకు వర్తింపచేయరాదని, కొన్నింటికే ఇది పరిమితం అవుతుందని చెప్పడానికి వీల్లేదని ధర్మాసనం తెలిపింది. ఇంతకు ముందు రెండుసార్లు సరైన చట్టపరమైన చర్యల పరిధిలో పెద్ద నోట్ల రద్దు జరిగినందున ఇప్పుడు కేవలం నోటిఫికేషన్ స్థాయిలో నిర్ణయం తీసుకున్నందున ఇది చెల్లనేరదని చెప్పడానికి వీల్లేదని పేర్కొన్నారు. నోటిఫికేషన్ సక్రమంగా ఉంది. లోపాలు లేవు. సరైన నిష్పత్తి క్రమంలో వెలువడ్డ నోటిఫికేషన్‌ను ఏ విధంగా కూడా చెల్లనేరనిదిగా ప్రకటించడానికి వీల్లేకుండా ఉందని అత్యధిక మెజార్టీ తీర్పులో స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News