Monday, December 23, 2024

ఇడి అధికారాలపై ‘సుప్రీం’ తీర్పు!

- Advertisement -
- Advertisement -

Supreme Court verdict on ED powers

మనీలాండరింగ్ (పిఎంఎల్‌ఎ) ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారాలను సమర్ధిస్తూ, పిఎంఎల్‌ఎలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికత అత్యంత కీలకం. అటువంటి మౌలిక విలువలకు విఘాతం కలిగించే విధంగా ఈ తీర్పు ఉన్నట్లు అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజకీయ ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకోవడానికో, భిన్నాభిప్రాయాలను కట్టడి చేయడం కోసమో ఈ నిబంధనలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండడంతో సహజంగానే సుప్రీంకోర్టు అభిప్రాయాలు రాజకీయంగా కలవరం కలిగిస్తున్నాయి. విమర్శలను, భిన్నాభిప్రాయాలను, రాజకీయ వ్యతిరేకతను అడ్డుకోవడం కోసం అడ్డు అదుపు లేకుండా ఉపయోగించేందుకు అవకాశం లభించినట్లు స్పష్టం అవుతున్నది.

అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మొదట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను, ఆ తరవాత ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం కోసం 17 ఏళ్ళ క్రితం ఈ చట్టం భారత దేశంలో అమలులోకి వచ్చింది. అయితే క్రమంగా భారత ప్రభుత్వం ఈ చట్ట పరిధిని విస్తరిస్తూ, సాధారణ ఆర్ధిక నేరాలను సహితం ఈ చట్టం పరిధిలోకి తీసుకు వస్తూ ఉండడం ద్వారా నేరారోపణలు రుజువు కాకుండానే, నిందితులు శిక్షకు గురయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ చట్టంలో నిందితులే తాము నిర్దోషులని నిరూపించుకోవాల్సి ఉండడం, వారు చేసిన నేరం ఏమిటో తెలుపకుండానే అరెస్ట్ చేసే అవకాశం ఉండడం, విచారణ పేరుతో సంవత్సరాలు సాగదీసి వీలుండడంతో ఈ చట్టం అమలు మొదటి నుండి తీవ్ర విమర్శలకు గురవుతున్నది. ప్రస్తుతం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ చట్టంలోని విశృంఖల నిబంధనలకు బాధితులు అవుతున్నారు. దానితో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా దర్యాప్తు సమయంలో బలవంతంగా నిందితుల ప్రకటన అంటూ వారి సంతకాలు సేకరించడం, అధికారుల ముందు చెప్పిన వాటికి న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం లేకపోవడం మౌలిక రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా ఉన్నదని చెప్పవచ్చు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొనకపోవడం విచారకరం.

మరోవంక, సోదాలు, జప్తు నిబంధనలకు న్యాయపరమైన పర్యవేక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. షెడ్యూల్ నేరం ఆరోపించకుండానే మనీ-లాండరింగ్ కోసం ప్రాసిక్యూషన్‌ను అనుమతించే నిబంధనలు, సాధారణ పౌరులకు కలిగించే రక్షణలను సహితం అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. అయితే, ఈ చట్టం క్రింద కొన్ని రోజులు జైలులో గడిపి వచ్చిన మాజీ ఆర్ధిక మంత్రి పి చిదంబరం ఈ చట్టంను తీసుకు రావడం గమనార్హం. ఆ సమయంలో చట్టం దుర్వినియోగం కాకుండా నిర్దిష్టమైన నిబంధనలు లేకుండా చేయడంతో ఈనాడు ఆయనతో సహా ఆయన పార్టీ నాయకులు కలవరపడవలసి వస్తున్నది. ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా తీసుకొచ్చే అన్ని రకాల చట్టాలు ఈ విధంగానే ఉండడం గమనార్హం.

గతంలో వచ్చిన టాడా చట్టం గాని, ప్రస్తుతం అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం గాని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం గాని అటువంటి కోవకు మాత్రమే చెందుతాయి. ఈ అన్ని చట్టాలలో కోర్టులలో శిక్షలు పడిన కేసులు నామమాత్రం కావడం గమనార్హం. ఉగ్రవాదంపై వ్యతిరేకంగా తీసుకొచ్చిన టాడా చట్టంలో సుమారు 90 శాతం కేసులు గుజరాత్‌లో నమోదు చేశారు. వారెవ్వరిపై ఉగ్రవాద ఆరోపణలు లేకపోవడం గమనార్హం. నేర ప్రక్రియ అసాధారణ రీతులలో ఉన్న సందర్భాలలో కొన్ని కఠినమైన చట్టాలు అవసరమే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుత సందర్భంలో మనీ-లాండరింగ్ చట్టానికి షెడ్యూల్ కు సాధారణ నేరాలను కూడా జోడించడంతో చట్టం దుర్వినియోగంకు అవకాశం ఏర్పడుతున్నది. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అవినీతి, పన్నులు,- సుంకాల ఎగవేత వంటి తీవ్రమైన నేరాలకు మాత్రమే పరిమితం కావాలి. అయితే ఆచరణలో జాబితాలో మోసం, ఫోర్జరీ, కిడ్నాప్, కాపీరైట్- ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనలు వంటి నేరాలు ఉన్నాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ-లాండరింగ్ దర్యాప్తు పేరుతో ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం కలిగిస్తున్నది. విచ్చలవిడిగా సోదాలు జరపడం, జప్తులు చేయడం, అరెస్టులకు పాల్పడటం జరుగుతున్నట్లు అనుభవం స్పష్టం చేస్తున్నది. పిఎంఎల్‌ఎ నిబంధనలు నిస్పాక్షిక, సార్వత్రిక న్యాయ సూత్రాలకు, ప్రమాణాలకు అనుగుణంగా లేవని కూడా వెల్లడి అవుతున్నది. గతంలో తాను ఇచ్చిన అనేక తీర్పులను సుప్రీంకోర్టు ఆ తర్వాత కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఈ చట్టం విషయంలో అదే జరిగే అవకాశం లేకపోలేదు. కానీ, ఈలోగా ఎటువంటి పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇచ్చినట్లయింది. ఈ చట్టం రావడానికి ప్రధాన కారణమైన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురవడం కార్యకలాపాలలో భారీ ఎత్తున దొంగచాటుగా లావాదేవీలు జరుగుతున్నాయనడంలో సందేహం లేదు. పాకిస్థాన్ వంటి దేశాలలో అయితే ఉన్నత సైనికాధికారులు, రాజకీయ నాయకులు సహితం అందులో ప్రత్యక్షంగా భాగస్వాములవుతున్నారు. అటువంటి రుగ్మతలను కట్టడి చేయడం కోసం అంతర్జాతీయంగా ఏర్పడిన ఆందోళనలు సమర్ధనీయమైనవి. అయితే వాటిని సాకుగా తీసుకొని రాజకీయ ప్రత్యర్థులపై, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే వారిపై ఈ చట్టాన్ని ఎటువంటి వివక్ష లేకుండా ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరవేసిన్నట్లు అవుతుంది. పైగా, ఎంపిక చేసిన వారిపై ఈ చట్ట నిబంధనలను ప్రయోగిస్తున్నారు.

ఉదాహరణకు ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత్ బిస్వాశర్మ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ప్రకంపనాలు సృష్టించిన శారదా కుంభకోణంలో ఆయనకు సంబంధం ఉన్నట్లు నిర్దుష్టమైన ఆధారాలు లభ్యమైనా, ప్రతి నెలా ఆయనకు భారీ మొత్తాలలో నగదు అందిన్నట్లు స్పష్టమైనా ఆయన బిజెపిలో చేరడంతో ఆయనను కనీసం సిబిఐ విచారణ కూడా జరపలేదు. బెంగాల్‌లో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ లో ప్రస్తుతం బిజెపిలో కీలక పదవులలో ఉన్న కొందరు పేర్లు ఉన్నప్పటికీ, వారితో పాటు పేర్లున్న టిఎంసి నాయకులను అరెస్ట్ చేసిన సిబిఐ బిజెపి నాయకులను కనీసం విచారించే ప్రయత్నం చేయడం లేదు. తాను బిజెపిలో చేరడంతో ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నానని, తనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తాయనే భయం ఇప్పుడు తనకు లేదని పుణెలో ఆ పార్టీలో కొద్ది కాలం క్రితం చేరిన ఓ నాయకుడు బహిరంగంగా పేర్కొనడం గమనార్హం. బిజెపిలో కీలక స్థానా ల్లో ఉన్న పలువురిపై అటువంటి ఆరోపణలు వచ్చినా వారి గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడం లేదు. పైగా కర్ణాటకలో పిసిసి అధ్యక్షుడు శివకుమార్‌పై పలు దాడులు జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులే ‘మీరు బిజెపిలో చేరితే మాకు, మీకు ఈ ఇబ్బందులు ఉండవు గదా’ అని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.

మహారాష్ట్రతో పాటు పలు చోట్ల రాజకీయ ప్రత్యర్థులను సొంత పార్టీ వదిలి తమతో చేరే విధంగా చేయడంలో కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వత్తిడులు తీసుకు వస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎఫ్‌సిఆర్‌ఐ కూడా అదే విధంగా దుర్వినియోగం అవుతున్నాయి. ఇటువంటి చట్టాలను దుర్వినియోగ పరిచి, ఆర్ధిక నేరాలు పాల్పడిన వారిని కట్టడి చేయడం యుపిఎ లో ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో చిదంబరం ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని మరింత పకడ్బందీగా, స్పష్టమైన రాజకీయ వ్యూహంగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సుమారు 20 ఏళ్లుగా పార్లమెంట్‌లో కీలకమైన చట్టాల గురించి సవివరంగా చర్చలకు అవకాశాలు ఉండడం లేదు. చట్టాల పరిశీలన సమగ్రంగా జరగడం లేదు. హడావుడిగా, సంకుచిత ఉద్దేశాలతో రాజకీయ ప్రయోజనాలు ఆశించి తీసుకు వస్తున్నారు. అందుకనే ఇటువంటి విపరీత పరిణామాలకు అవకాశం ఏర్పడుతుంది.

* చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News