Wednesday, January 22, 2025

ఇల్లాలు అమూల్యం ఆణిముత్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఓ కుటుంబంలో ఇల్లాలు లేదా గృహిణి పాత్ర కీలకమైనదని, అమూల్యమైనదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కుటుంబంలోని వేతనజీవులకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో గృహిణికి కూడా అంతే ప్రాధాన్యత ఉండాలని స్పష్టం చేశారు. ఇంటి ఆలనాపాలన చూసుకోవడం తేలికకాదు. ఈ బాధ్యతల నిర్వహణ వెలకట్టలేనిది. ఆర్థికపరంగా దీని విలువ ఎంత అనేది ఎవరూ లెక్కకట్టలేరని గృహిణి కీలక పాత్ర గురించి అత్యున్నత న్యాయస్థానం తొలిసారిగా తేల్చివేసింది. ఆమె నిర్వహించే బాధ్యత, నిర్వర్తించే సేవలు గణనీయం అని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ గృహిణికి నష్టపరిహారాన్ని రూ 6 లక్షలకు పెంచుతూ న్యాయమూర్తులు సూర్యకాంత్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవలే ఓతీర్పు వెలువరించింది. రాత్రింబవళ్లు ఇంటి పనులకు అంకితమయ్యి జీవితాంతం పనిచేసే ఆడవారికి ఇవ్వాల్సిన విలువ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ధర్మాసనం తెలిపింది. ఇంట్లో ఉద్యోగులు ఉండొచ్చు.

వారు తద్వారా వేతనాలు తెచ్చుకుంటూ ఉండొచ్చు. అయితే ఇంటి పని, పిల్లలు ఇతరులు బాగోగులకు ఆమె పడే తాపత్రయం విలువ అంతా ఇంతాఅని ఎవరూ తేల్చలేరని ధర్మాసనం పేర్కొంది. 2006లో ఓ ప్రమాదంలో ఓ గృహిణి మరణించింది. ఆమె ప్రయాణించిన వాహనానికి బీమా సౌకర్యంలేదు. దీనితో ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వాహన యజమానిపై ఉంది. ఆమె కుటుంబానికి రెండున్నర లక్షల పరిహారం చెల్లింపునకు తొలుత యాక్సిడెంట్ల పరిహారాల ట్రిబ్యునల్ ఆదేశాలు వెలువరించింది. అయితే ఇది అన్యాయం అని పేర్కొంటూ కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆమె కేవలం గృహిణి అని, ఆమెకు నామమాత్రపు నిర్ణీత ఆదాయం కూడా లేదని , ఆమె వయస్సు ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖరారు చేసిన ఈ పరిహారం సబబేనని పేర్కొంటూ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

దీనితో కుటుంబం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఓ ఇల్లాలి పనికి విలువ ఈ విధంగా కడుతారా? ఆమె సేవలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టుల తీర్పులను కొట్టివేసింది. కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని వాహన సొంతదారును ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News