Sunday, December 22, 2024

కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన అవినీతి కేసులో బెయిల్ కోసం ముందుగా కింది కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్న సిబిఐ వాదనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దశలో మళ్లీ ఈ వ్యవహారాన్ని కింది కోర్టుకు పంపడం తగదని ఆయన వాదించారు. గురువారం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.

ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న సుప్రీంకోర్టు బెయిల్ కోసం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు సిబిఐ అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై తన తీర్పును రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ల విచారణార్హతను సిబిఐ తరఫున హాజరైన అదనపు సొఇసిటర్ జనరల్ ఎస్‌వి రాజు ప్రశ్నిస్తూ ఇదే కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కూడా బెయిల్ కోసం దిగువ కోర్టుకు సుప్రీంకోర్టు తిప్పి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్ వెళ్లారని, ఆయన ముందుగా దిగువ కోర్టుకు వెళ్లాలన్నదే తన ప్రాథమిక అభ్యంతరమని ఆయాన వాదించారు.

కేజ్రీవాల్ తానొక అసాధారణ వ్యక్తినని భావిస్తున్నారని, ఇతర సామాన్యులు ముందు దిగువ కోర్టుకు వెళితే ఆయన మాత్రం ప్రత్యేకంగా వ్యవహరిస్తారని రాజు వ్యాఖ్యానించారు. అందరి పట్ల ఒకేరకంగా వ్యవహరించవలసి ఉంటుందని ఆయన అన్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన పక్షంలో ఆయన అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు మనోధైర్యాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని రాజు వాదించారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ అలాంటి మాటలు వద్దని, తాము ఎటువంటి ఉత్తర్వులు జారీచేసినా అలాంటివి జరగకుండా చూస్తామని రాజుకు హామీ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News