Wednesday, January 22, 2025

వర్గీకరణ అమలు ఎలా?

- Advertisement -
- Advertisement -

ఎస్‌సి, ఎస్‌టి వర్గీకరణ అంశంపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యుత్సాహాన్ని కనబరిచారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ చర్చ చోటు చేసుకుంది. నిజానికి ఎస్‌సి వర్గీకరణ అంశం దశాబ్దాలుగా పెండింగ్‌లోఉన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఈ అంశానికి అన్ని రాజకీయ పార్టీలు ఆయా సందర్భాల్లో మద్దతు తెలిపిన సంగతి కూడా గమనార్హం. ఈ నెల ఒకటో తేదీన ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దీనిపై ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో మాదిగ ఉప కులాలకు చెందిన సీనియర్ మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు ఆ వర్గానికి చెందిన కొందరు శాసనసభ్యులు ఆయన చెంతన నిలబడి ఉండడం పలువురికి ఆశ్చర్యం కలిగించకమానదు. అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన వర్గీకరణ అంశంలో ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నట్లుగా వ్యవహరించడం ప్రభుత్వ అధిపతిగా వాంఛనీయం కాదు అంటూ దళిత మేధావుల అభిప్రాయపడుతున్నారు.

ఇదే సందర్భం లో ఆయన మాట్లాడుతూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చే విధంగా తమ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపించామని పేర్కొన్నారు. అంతేకాక వర్గీకరణ అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణనే అవుతుందని, ఇప్పటికే తామిచ్చిన నోటిఫికేషన్లను నిలుపుదల చేసి కోర్టు తీర్పు అమలుకు ఆర్డినెన్స్ తీసుకు వస్తామని ప్రకటించారు.ఈ మొత్తం వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుపై సర్వత్ర చర్చ జరుగుతున్నది. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేయకముందే, తీర్పులో ఉన్న అంశాలను సమగ్రంగా పరిశీలించక మునుపే శాసనసభలో ముఖ్యమంత్రి స్థాయి లో ఆయన చేసిన ప్రకటన ముఖ్యమంత్రి స్థాయికి తగని విధంగా ఉన్నదంటూ నిపుణులు పేర్కొంటున్నారు. సుప్రీం తీర్పును అమలు చేసేందుకు విధివిధానాలను రూపొందించవలసి ఉంటుంది. తీర్పు దిశా నిర్దేశాలను న్యాయకోవిధులు, ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, మరీ ముఖ్యంగా మంత్రివర్గంతో చర్చించి వారి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విధానపరమైన నిర్ణయాలను తీసుకొని ఉంటే సముచితంగా ఉండేది.

వార్తా సంస్థలలో వస్తున్న వార్తల ఆధారంగా చేసుకుని ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారా? లేక తీర్పును ముందుగానే ఊహించారా? అంటూ వర్గీకరణ వ్యతిరేకవాదులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రకటన చేసే సమయానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ సుప్రీం తీర్పుపై స్పందించనేలేదు. అయినప్పటికీ ఆయన శాసనసభలో తనదైన శైలిలో స్పందించారు. సుప్రీం తీర్పు ప్రకారం వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అధికారాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమిటి? సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం కూడా దీనిపై దిశా నిర్దేశాన్ని చేయవలసి ఉంటుంది కదా? అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఈ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తానన్న ఆయన ప్రకటన పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్గీకరణ అంశంలో ఆది నుండి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ సైతం ఈ డిమాండ్ చేయలేదని అయినప్పటికీ రేవంత్ ఎందుకు అంత అత్యుత్యాహాన్ని ప్రదర్శించారని వారు ప్రశ్నిస్తున్నారు? మాదిగలు బిజెపికి దగ్గరవుతున్నారన్న రాజకీయ కోణంతో రేవంత్ ఆదరాబాదరా నిర్ణయాలు ప్రకటించారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఒక సామాజిక అంశంలో నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంటుందని, వర్గీకరణ అంశం ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానాల్లో నలుగుతూ వచ్చిన అంశం కనుక అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుందని, న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తూనే తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోవలసిన అవసరం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
జనాభా ప్రాతిపదికన ఆయా కులాలకు సమాన వాటాలు పంచాలనేది ఆది నుండి వర్గీకరణ వాదుల డిమాండు. ఉప కులాల జనాభా ప్రాతిపదికన వర్గీకరణ ఏ విధంగా చేయాలనే దానిపై సమగ్రమైన విధివిధానాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. గతంలో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎ, బి, సి, డి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. 06 జూన్ 1997న జిఒ ఎంఎస్ నెంబర్ 68 ద్వారా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణను అమలులోనికి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం వర్గీకరణ అమలుకు 27 ఏళ్ల క్రితం రామచంద్ర రాజు కమిషన్ రిపోర్ట్‌ని ప్రాతిపదికగా తీసుకుంటారా? లేక మరో కమిషన్ నియమించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తారా అనేది ప్రశ్న. అయితే 27 ఏళ్ల క్రితం ఎస్‌సి జనాభాకు ప్రస్తుత జనాభాకు మాత్రమే కాక సామాజిక పరిస్థితులలోనూ వ్యత్యాసాలు ఉండడం సహజం.

అంతేకాక ఉప కులాల జనగణన కూడా మరో ప్రతిబంధకం కావచ్చు. ఎందుకంటే 59 ఉపకులాల జనగణన కేంద్ర ప్రభుత్వ చేయవలసి ఉంటుంది. వీటి ఆధారంగా మాత్రమే కోర్టు తీర్పును అనుసరించి ఆయా కులాలకు రిజర్వేషన్లను వర్తింప చేయవలసి ఉంటుంది. జస్టిస్ రామచంద్ర రాజు నివేదిక లోపభూయిష్టంగా ఉన్నదని, దీనిని అప్పటి ప్రభుత్వం తన ప్రాధాన్యతలకు అనుకూలంగా రూపొందింపజేసి వర్గీకరణ అమల్లోకి తెచ్చిందని వర్గీకరణ వ్యతిరేకవాదుల వాదన. అంతేకాక ఈ నివేదిక ప్రకారం చేసే వర్గీకరణ వల్ల ఎస్‌సి కులంలోని 59 కులాలకు సమాన ప్రయోజనాలు దక్కవు అంటూ వారు వాదిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. చట్టసభల సాక్షిగా తెరాస శాసన మండలి సభ్యులు గోరేటి వెంకన్న మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో పలు కీలక అంశాలను లేవనెత్తారు. వాస్తవానికి మాల సామాజిక వర్గానికి చెందిన మేధావి, ప్రజా గాయకుడు గోరేటి, వర్గీకరణ అంశాన్ని ఆది నుండి సమర్థించారు. అంతేకాక ఆయనతో పాటు అదే వర్గానికి చెందిన ప్రజాయుద్ధ నౌక స్వర్గీయ గద్దర్, పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, కత్తి పద్మారావు వంటి ప్రముఖులు కూడా ఈ అంశంలో సానుకూలత వ్యక్తం చేశారు.

అయితే ఇటీవల పరిణామాలపై గోరేటి వెంకన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితులపై దమనకాండలు జరిగినప్పుడు ఈ అత్యుత్సాహాన్ని ఎందుకు ప్రదర్శించలేదని ఆయన ప్రశ్నించారు. మా లెక్కలు మాకు తేల్చకుండా మమ్మల్ని కలహించుకునే విధంగా ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆవేదన చెందారు. ఆయన వాదనలోని వాస్తవాలను దళిత మేధావులు అంగీకరిస్తున్నారు. ఇదే సందర్భంలో సుప్రీం తీర్పు ఒక సామాజిక వర్గంపై విజయంగా భావించే విధంగా కొందరు వ్యవహరించడం వర్గీకరణ అంశానికి హేతుబద్ధమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రతిబంధకం కాగలదని, ఇది కులవైషమ్యాలకు దారితీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల అంశం కార్చిచ్చును రగిలించింది. రిజర్వేషన్లు వంటి సున్నితమైన అంశాలలో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించకూడదో తెలుసుకునేలోపే బంగ్లా ప్రధాని షేక్ హసీనా పదవికి దూరం కావడమే కాక దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్గీకరణ అంశంలో ప్రభుత్వాలు వేసే ప్రతి అడుగు మరింత సామాజిక మార్పుకు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయాలను ద్విగుణీకృతం చేసే విధంగా ఉండాలని అందరి కోరిక.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News