Saturday, November 16, 2024

కేంద్రం x సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో కేంద్రం తరచుగా కయ్యానికి దిగుతున్నది. గిల్లికజ్జాలు పెట్టుకొంటున్నది. ఈ ధోరణి ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకొన్నది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతున్న తీరు న్యాయమూర్తుల పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసి వారిని నైతికంగా కుంగదీసేలా వుండడం అత్యంత ఆందోళనకరం. ఇది ఒకసారికో, రెండు సార్లకో పరిమితం కాలేదు. ఆయన నోరు తెరిచినప్పుడల్లా ఉన్నత న్యాయమూర్తులు దిగజారిపోతున్నారనే అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించడానికే ప్రాధాన్యమిస్తున్నారు. కోర్టులకు దీర్ఘ కాలం సెలవులు ఇవ్వడం వల్ల న్యాయార్థులకు అసౌకర్యం కలుగుతున్నదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతున్నదని కిరణ్ రిజిజు గురువారం నాడు రాజ్యసభలో చేసిన ప్రకటనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్రంగా నొచ్చుకొన్నట్టు స్పష్టపడుతున్నది. అందుకాయన వెనువెంటనే ఆచరణలో ప్రతిస్పందించారు.

17వ తేదీ శనివారం నుంచి జవనరి ఒకటో తేదీ వరకు సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు ప్రకటించామని తెలియజేస్తూ ఈ కాలంలో సెలవు కాలపు ధర్మాసనాలు ఒక్కటి కూడా అందుబాటులో వుండవని చంద్రచూడ్ శుక్రవారం నాడు కోర్టు గదిలో న్యాయవాదుల ఎదుటనే ప్రకటించారు. కోర్టు సెలవులలో వున్నప్పుడు అత్యవసర కేసుల విచారణకు సెలవు కాలపు ధర్మాసనం అందుబాటులో వుండడం ఇంత వరకు ఆనవాయితీగా వస్తున్నది. దానికి ఇప్పుడు స్వస్తి చెప్పినట్టు చంద్రచూడ్ ప్రకటన వెల్లడిస్తున్నది. ఇది కేంద్ర మంత్రి రిజిజు రాజ్యసభలో చేసిన బాధ్యతా రహిత ప్రకటనకు సిజెఐ ప్రకటించిన ధర్మాగ్రహంగానే బోధపడుతున్నది. ఉన్నత న్యాయస్థానాలను కాషాయ న్యాయమూర్తులతో నింపుకోడానికి బిజెపి పాలకులు ఒక పద్ధతి ప్రకారం కొలీజియం వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతను కాపాడడం కోసం సుప్రీంకోర్టు దీనిని అదే పనిగా ప్రతిఘటిస్తున్నది.

ఈ యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తూ కేంద్ర పాలకులు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌కడ్, కిరణ్ రిజిజుల ద్వారా అనుచితమైన ప్రకటనలను ఇప్పిస్తున్నది. శీతాకాలానికి రెండు వారాల పాటు, వేసవి కాలంలో ఆరు వారాల పాటు, దసరా, దీపావళి పండగలకు చెరి వారం పాటు కలిపి ఏడాదిలో మొత్తంగా పది వారాల పాటు సుప్రీంకోర్టుకు సెలవులు ప్రకటిస్తారు. దీనిపై వచ్చిన విమర్శకు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, కెజి బాలకృష్ణన్ వంటి వారు తీవ్రంగా స్పందించారు. సెలవుల్లో జడ్జీలు ఆనందంగా గడుపుతారనే దురభిప్రాయం వుందని, అది వాస్తవం కాదని, వారాంతాల్లోనూ, సెలవుల్లో కూడా న్యాయమూర్తులు పని చేస్తారని జస్టిస్ ఎన్‌వి రమణ ప్రకటించారు. ఆ సమయాల్లో పెండింగ్‌లో వున్న తీర్పులను రాస్తారని వెల్లడించారు. సెలవుల్లో తాము సుఖపడతామనే అభిప్రాయం తప్పని అన్నారు.

ఇది ఎంత మాత్రం కొట్టివేయదగిన అభిప్రాయం కాదు. ఆ లెక్కన చూసినప్పుడు పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు కేవలం చట్ట సభలు సమావేశమైనప్పుడే అరకొరగా హాజరై మిగతా సమయాలను సెలవులుగా భావించి సుఖపడతారని అంటే కుదురుతుందా? న్యాయమూర్తులను దుర్వాఖ్యలతో గాయపరచి తమ దారికి తెచ్చుకోడానికి బిజెపి పాలకులు ఒక పద్ధతి ప్రకారం ఈ దాడికి పూనుకొన్నట్టు బోధపడుతున్నది. కిరణ్ రిజిజు మరో సున్నితమైన అంశంలోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను మానసికంగా గాయపరిచారు. వాస్తవం చెప్పాలంటే వారి విధి నిర్వహణలో అన్యాయమైన జోక్యం చేసుకొన్నారు. బెయిల్ పిటిషన్ల వంటి వాటిపై సుప్రీంకోర్టు సమయాన్ని వృథా చేయరాదని పార్లమెంటులో ఆయన చేసిన ప్రకటన అత్యంత అభ్యంతరకరమైనది. దీనికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గట్టి జవాబునే ఇచ్చారు.

శుక్రవారం నాడు ఆయన ఒక ధర్మాసనానికి సారథ్యం వహిస్తూ వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో కలుగజేసుకోలేకపోతే తమ ఉనికికి అర్థమే లేదని ఆయన అన్నారు. పౌరులు స్వేచ్ఛ కోసం చేసే ఆర్తనాదాన్ని, మా అంతరాత్మ ప్రబోధాన్ని వినిపించుకోడం మా బాధ్యత అని ఆయన స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగంలోని 21వ అధికరణ పౌరుల జీవన హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తున్నది. చట్టం అనుమతించే మార్గంలో తప్ప ఇతర ఏ విధంగానూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రాణాలను హరించే హక్కు, అధికారం ఎవరికీ లేవని ఈ అధికరణ స్పష్టమైన గిరిగీసి చెబుతున్నది. పాలకులు గాని, వారి పోలీసులు గాని దీనిని ఉల్లంఘించి వ్యక్తుల ప్రాణాలను బలిగొన్నా, స్వేచ్ఛలను హరించినా రంగ ప్రవేశం చేసి వాటిని గట్టిగా అడ్డుకోవలసిన బాధ్యత రాజ్యాంగం న్యాయస్థానాలపై వుంచింది.

వాస్తవానికి ఇదే మన ప్రజాస్వామానికి ప్రాణప్రదమైనది. బెయిల్ కోసం నిందితులు చేసుకొనే అభ్యర్థనల పరిష్కారం ఇందులో భాగమే. ఇటువంటి ప్రధానమైన కర్తవ్యాన్ని అప్రధానమైన అంశంగా భావించి బెయిల్ దరఖాస్తులపై కాలం దుర్వినియోగం చేయొద్దని కేంద్రం సుప్రీంకోర్టుకి సూచించడం కంటే రాజ్యాంగ అతిక్రమణ మరొకటి వుండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News