Monday, December 23, 2024

గవర్నర్లకు మొట్టికాయలు!

- Advertisement -
- Advertisement -

కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు మధ్య వివాదం పరాకాష్ఠకు చేరుకొన్న దశలోనే సోమవారం నాడు సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య గవర్నర్లకు స్పష్టంగా దిశానిర్దేశం చేస్తున్నది. శాసన సభలో ఆమోదించి పంపిన బిల్లులపై న్యాయస్థానాలు జోక్యం చేసుకొనేంత వరకు గవర్నర్లు నిర్ణయం తీసుకోకపోడం అలవాటైపోయిందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.‘ఇది చాలా తీవ్రమైన సమస్య, దీనిని కూలంకషంగా పరిశీలించాలి. గవర్నర్లు తమ పని తాము చేసేటట్టు చూడడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి ఎందుకు తలెత్తాలి? రాజ్యాంగం అవతరించినప్పటి నుంచి మనది ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి సమస్యలను గవర్నర్లు, ముఖ్యమంత్రులు కలిసి పరిష్కరించుకోవాలి. రాజ్యాంగం ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలయ్యేటట్టు చూస్తాము’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారంటే ఇక ముందు ఏ రాష్ట్ర గవర్నరూ జాప్యందారీ వ్యూహాలను ప్రయోగించరాదని ఆయన అనుమానాతీతంగా చెప్పారు.

పంజాబ్ ప్రభుత్వం అక్కడి గవర్నర్ బన్వరీ లాల్ పురోహిత్ వైఖరిని సవాలు చేస్తూ దాఖలు చేసుకొన్న పిటిషన్‌పై విచారణలో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతనే గవర్నర్ల బరి తెగింపు ఈ స్థాయికి చేరుకొన్నదని చెప్పక తప్పదు. తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల గవర్నర్లు కూడా అక్కడి శాసన సభల ఆమోదంతో తమకు చేరిన బిల్లులపై నిర్ణయాలు తీసుకోకుండా వాటిని నిరవధికంగా తమ వద్ద వుంచుకొన్న సందర్భాలున్నాయి. అప్పుడు కూడా ఆ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. పంజాబ్‌లో ఆర్థిక బాధ్యత, పన్ను చట్టాల సవరణ అంశాలకు సంబంధించినవి సహా అనేక కీలక బిల్లులను గవర్నర్ ఎప్పటికీ తేల్చకుండా తన వద్ద వుంచుకొన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రశ్నలు లేవనెత్తుతూ బిల్లులను తిప్పి పంపడం వరకే గవర్నర్లు చేయవలసిన పని. మంత్రి వర్గాలు వాటిని తిరిగి ఆమోదం కోసం పంపితే గవర్నర్లు కాదనడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రజలెన్నుకొన్న శాసన సభలో మెజారిటీ అనుభవిస్తున్న ప్రభుత్వం అదే సభ ఆమోదం పొంది పంపే బిల్లులు శిలాశాసనాల వంటివి.

వాటిని అడ్డుకొనే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వం నియమించే గవర్నర్లకు ఎంత మాత్రం లేదు. కేరళ ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు అనేక అంశాల మీద అసఖ్యత, వైరుధ్యం నెలకొని వున్నాయి. కెఎన్ బాలగోపాల్ అనే మంత్రి తన సమ్మతిని కోల్పోయాడని చెబుతూ ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్ 2022 అక్టోబర్ 25న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. కేరళ విశ్వవిదాలయాల తీరుపై గవర్నర్ తరచూ విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ కొంత మంది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని పద్ధతులకు అలవాటుపడిపోయి కేరళ యూనివర్శిటీల ప్రజాస్వామ్య ప్రవర్తనను అర్థం చేసుకోలేకపోతున్నారని మంత్రి బాలగోపాల్ వ్యాఖ్యానించినందుకు ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని గవర్నర్ సిఫారసు చేశారు. దానిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖాతరు చేయలేదు. 2020లో విజయన్ ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలోని పౌరసత్వ చట్ట సవరణకు సంబంధించిన భాగాన్ని శాసన సభలో చదవకుండా వదిలిపెట్టడం ద్వారా గవర్నర్ వివాదాస్పదుడయ్యారు.

అంతకు ముందు విజయన్ ప్రభుత్వం పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాసన సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కేరళ ప్రభుత్వం శాసన సభలో ఆమోదింపజేసి పంపిన 8 లేక 9 బిల్లులను గవర్నర్ ఏ నిర్ణయమూ తీసుకోకుండా తన వద్ద వుంచుకొన్నారు. వీటిలో 3 బిల్లులు రెండేళ్ళకు పైగా ఆయన వద్ద పెండింగ్‌లో వున్నాయి. విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు, కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లు, ప్రజారోగ్య సవరణ బిల్లు వంటివి కేరళ రాజ్‌భవన్‌లో గుర్రు నిద్ర తీస్తున్నాయి. కొన్ని బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకొన్నారని వివరమైన సమాచారాన్ని ఈ వారాంతానికి తెలియజేస్తానని పంజాబ్ కేసులో సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు విన్నవించుకొన్నట్టు తెలుస్తున్నది. గవర్నర్లపై ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి హామీయే రావడం ఆ తర్వాత గవర్నర్లలో చలనం కలగడం జరుగుతున్నది. ఇదంతా ప్రజాప్రభుత్వాల పనిని అడ్డుకోడానికి, అనవసరమైన కాలయాపనకు దారి తీసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.

కేంద్రం కక్ష సాధింపు సాధనాలుగా గవర్నర్లు దుర్వినియోగపడుతున్నారు. గవర్నర్ సమ్మతి మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి అని రాజ్యాంగంలో వున్న వాక్యాన్ని ఈ రాష్ట్రాల గవర్నర్లు అతిగా అన్వయించుకొంటున్నారు. ఈ సమ్మతి అనేది శాసన సభల్లో సంఖ్యాధిక్యత కలిగిన ప్రభుత్వాల విషయంలో అప్రమేయంగా పని చేయవలసి వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News