నీట్ పరీక్ష రద్దుకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ : ఈ నెల 12వ తేదీన జరగాల్సిన మెడికల్ నీట్ యుజి పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. పరీక్ష ప్రక్రియలో తాము జోక్యం చేసుకోదల్చుకోలేదని, ఇప్పటికిప్పుడు దీనిని రీషెడ్యూల్ చేయాలని ఆదేశించడం అనుచితం అవుతుందని న్యాయమూర్తులు ఎఎం ఖాన్విల్కర్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బహుళ పరీక్షలకు హాజరు అయ్యేందుకు సిద్ధపడే విద్యార్థులు, తమకు ఏదీ ప్రాధాన్యం అనేది నిర్థారించుకుని ఆ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని ధర్మాసనంతెలిపింది. పరీక్షల తేదీల ఖరారు విషయంలో పలు అంశాలు ఉంటాయని, వీటిపై ప్రతి ఒక్కరిని పరిగణనలోకి తీసుకోవడం, వారిని సంతృప్తిపర్చడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అయితే ఈ పరీక్షకు సంబంధించి పిటిషనర్ ఇప్పటికైనా సంబంధిత అధికారులకు తమ సమస్యను తెలుసుకోవడం మంచిదని, తమ జోక్యం అనుచితం అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 12వ తేదీననే పలు ఇతర పరీక్షలు కూడా ఉన్నాయని, ఈ దశలో నీట్ పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్లు దాఖలు చేసిన వారి తరఫున న్యాయవాది షోయెబ్ ఆలం వాదించారు. అయితే ఒక్కశాతం మంది అభ్యర్థులకు ఈ సమస్య ఉండి ఉంటుందని, వారికోసం ఇతర అత్యధిక అభ్యర్థుల పరీక్షల అవకాశాన్ని దెబ్బతీయడం కుదరకపోవచ్చునని, అయితే పరీక్షల నిర్వహణ సంబంధిత బోర్డులను ఈ విషయంలో ఆశ్రయించడం మంచిదని ధర్మాసనం స్పష్టం చేసింది.