Sunday, January 19, 2025

మేం అవునంటే.. మీరు కాదంటారా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొలీజియం సిఫార్సులను తరచూ కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టడం దారుణం, ఆందోళనకరం అని సుప్రీంకోర్టు శుక్రవారం స్పందించింది. దేశంలో న్యాయమూర్తుల భర్తీకి తమ ఆధ్వర్యంలోని కొలీజియం నుంచి పేర్లను పలు దఫాలుగా తాము ప్రభుత్వం దృష్టికి ఆమోదానికి పంపించడం, వీటిని తిరిగి కేంద్రం వెనకకు పంపించడం ఆందోళనకర పరిణామం అని న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగపరంగా ఏర్పాటు అయిన న్యాయస్థానాలలో న్యాయమూర్తుల భర్తీకి ఏర్పాటు అయిన ప్రక్రియగా కొలీజియం ఉంది. నియామకాల గురించి తాము పదేపదే పేర్కొంటున్నప్పటికీ దీనికి అడ్డుతగలడం అనవసరమే అని ధర్మాసనం కేంద్రం తీరు పట్ల ఆక్షేపణ తెలిపింది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియకు లెజిస్లేచర్ నుంచి మరింత సముచిత వ్యవస్థ లేదా ఏర్పాటు చేసుకోవచ్చు, దీనిని ఎవరూ కాదనలేరు. అయితే ఇప్పుడున్న ఈ కొలీజియం పద్ధతికి, ఈ ప్రక్రియలో వెలువరించే సిఫార్సులకు విలువ ఇవ్వాల్సి ఉంటుంది.

కొత్త వ్యవస్థ వచ్చే వరకూ అయినా ఇప్పుడున్న పద్ధతిని పాటిస్తే మంచిదని ధర్మాసనం తెలిపింది. సంబంధిత అంశంపై దాఖలు అయిన పిటిషన్లపై జరిగిన వాదోపదవాదాల దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తమ వాదనలో కొలీజియం పట్ల కేంద్రం వైఖరి సరికాదని తెలిపారు. పలుసార్లు కొలీజియం వెలువరించిన పేర్లను కేంద్రం వెనకకు పంపించడం జరుగుతోందని వాదించారు. ఇది చాలా ఆందోళనకర పరిణామం. దీని గురించి తాము ఇంతకు ముందటి రూలింగ్‌లో కూడా తమ స్పందనను తెలిపామని ధర్మాసనం గుర్తు చేసింది. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులలో జడ్జిల నియామకానికి సంబంధించి పేర్లు వెలువడ్డా , సంబంధిత ప్రక్రియ ముందుకు సాగకపోవడం , కొలీజియం నియామకాలు తరచూ పెండింగ్‌లో పడటం పట్ల మొత్తం మీద న్యాయమూర్తుల నియామకం జాప్యం జరుగుతోందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంతో ధర్మాసనం ఏకీభవించింది. న్యాయమూర్తుల ఎంపిక విషయంలో ప్రభుత్వానికి వేరే అభిప్రాయాలు ఉండవచ్చు.

వీటిని తప్పుపట్టడం లేదని, కానీ ఎటువంటి స్పందన లేకుండా దీర్ఘకాలం ఈ సిఫార్సులను తొక్కిపెట్టడం లేదా ఫైలును తిప్పిపంపడం సరికాదని సుప్రీంకోర్టు తన ఆక్షేపణ తెలిపింది. ఇక ఏ వ్యవస్థకు అయినా మంచి చెడులు ఉండనే ఉంటాయి. లోపాలను అంటిపెట్టుకుని ప్రయోజనాలు కూడా మిళితం అవుతాయి. మనిషి కానీ ఏ వ్యవస్థ కానీ సంపూర్ణంగా చొక్కం బంగారం అనుకోవడానికి కుదరదు. నూటికి నూరుపాళ్లు ఉత్తమమైనదనే ఏర్పాటు ఉంటుందా? మొత్తం మీద బాగా ఉండే పద్ధతిని ఎంచుకున్నప్పుడు దీని ప్రాతిపదికన సాగితే తప్పేముంటుంది? అని సుప్రీంకోర్టు నిలదీసింది.

జస్టిస్ కౌల్ స్పందిస్తూ ఇప్పుడు జరుగుతున్న తంతులో ప్రతిభావంతులైన వారికి సకాలంలో స్థానందక్కడం లేదు. పైగా తమకు స్థానం దక్కినా సమర్థులు బాధ్యతలు తీసుకునేందుకు తటపటాయిస్తున్నారు. ఈ విధమైన వాతావరణం ఏర్పడుతోందని, ఇది సమంజసమేనా ? అని ఈ న్యాయమూర్తి కేంద్రం తీరును తప్పుపట్టారు. గత నెలలో కొలీజియం నుంచి ఐదుగురు జడ్జిల పేర్లను పంపించినప్పుడు , దీనిపై కేంద్రం వైఖరి ఏమిటని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ఎజి స్పందిస్తూ కోర్టు ప్రస్తుతానికి ఈ సిఫార్సులను పక్కకు పెట్టాలని, కేంద్రం పరిశీలిస్తోందని సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News