బొంబాయి హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఫలితాలను ప్రకటించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ)కి సుప్రీంకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. మహారాష్ట్రలోని ఒక పరీక్షా కేంద్రంలో క్వశ్చన్ పేపర్లు, ఓఎంఆర్ షీట్లు కలసిపోయిన కారణంగా నీట్ ఫలితాలను ఎన్‌టిఎ ప్రకటించకూడదని, ఇద్దరు అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తూ బొంబాయి హైకోర్టు ఇటీవల జారీచేసిన ఉత్తర్వులపై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే మంజూరు చేసింది.
హైకోర్టు తీర్పును తాము నిలుపుదల చేస్తున్నామని, నీట్ ఫలితాలను ఎన్‌టిఎ ప్రకటించవచ్చని ఎన్‌టిఎ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వినిపించిన వాదనల అనంతరం ధర్మాసనం ప్రకటించింది. కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత(దీపావళి సెలవుల అనంతరం) ఆ ఇద్దరు విద్యార్థుల గురించి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. ఇద్దరు విద్యార్థుల కోసం 16 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేయలేమని, ఈ లోపల కౌంటర్ దాఖలు చేయడానికి నోటీసులు జారీచేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 12న 16,14,777 మంది అభ్యర్థుల కోసం నీట్(యుజి) పరీక్ష జరిగింది. 202 నగరాలలోని 3,682 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించారు.