Thursday, November 14, 2024

జన భాషల్లో సుప్రీం తీర్పులు!

- Advertisement -
- Advertisement -

ఈ నెల 2న ప్రారంభించిన ఇ ఎస్‌సిఆర్ (ఎలెక్ట్రానిక్ సుప్రీంకోర్టు) ప్రాజెక్టు ద్వారా 34,000 సుప్రీంకోర్టు తీర్పులను ఆన్‌లైన్‌లో వుంచారు. వీటిని అందరూ చదువుకొనే ఏర్పాటు చేశారు. దానికి కొనసాగింపుగా రిపబ్లిక్ దినోత్సవం నాడు 13 ప్రాంతీయ భాషల్లో వెయ్యికి పైగా సుప్రీంకోర్టు తీర్పులను వెబ్‌సైట్‌లో వుంచారు. ఇంత వరకు న్యాయ స్థానాలకు, న్యాయవాదుల న్యాయ జీవులకు మాత్రమే పరిమితమైన ఈ తీర్పులు ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోకి ఇవి తర్జుమా అయితే అది మరింత సంబరమవుతుంది. అంతేకాకుండా మారుమూలల్లోని ఆదివాసీ తెగల లిపిలేని భాషల్లో కూడా వీటిని వినిపించే అవకాశం కలిగితే అదింకా ఆనందంగా వుంటుంది. ప్రస్తుతమైతే సుప్రీంకోర్టు తీర్పులు ఒడియాలో 29, మరాఠిలో 14, అసోమీలో 4, గ్యారోలో 1, కన్నడలో 17, ఖాసీలో 1, మలయాళంలో 29, నేపాలీలో 3, పంజాబీలో 4, తమిళంలో 52, తెలుగులో 28, ఉర్దూలో 3 అందుబాటులోకి వచ్చాయి.

దేశంలో ఇప్పటికీ బహుశా సుదూర భవిష్యత్తులో కూడా ఆంగ్లమే అనుసంధాన భాషగా వుంటుంది. బిజెపి ఎంతగా రుద్దాలనుకొన్నా దేశమంతటికీ ఏకైక అనుసంధాన భాష అయ్యే యోగ్యత హిందీకి లభించదు. అందుచేత బ్రిటీష్ వారసత్వంగానే కావచ్చు, న్యాయస్థానాలు ఆంగ్లంలో విచారణలు జరపడం, తీర్పులివ్వడం తప్పనిసరై కొనసాగుతోంది. ఆ తీర్పుల సంగ్రహ స్వరూపాన్ని మాత్రమే వివిధ పత్రికల వార్తల్లో మనం చదవగలుగుతున్నాం. ఆంగ్లంలోని వాటి సమగ్ర స్వరూపాన్ని చదివే అవకాశం లభించడం లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) చొరవ తీసుకొని తమ తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదింపజేయడం మంచి పరిణామం. సుప్రీంకోర్టులో జరిగే కేసు విచారణలను దేశమంతా చూసేలా చేయడంతో మొదలు పెట్టి ఇప్పుడు ఇన్ని ప్రాంతీయ భాషల్లోకి ఆ తీర్పులను అనువదింపజేయబడడం గొప్ప మార్పు.

అయితే ఆ అనువాదాలు ఎలా జరుగుతాయి, పిల్లిని మార్జాలం అన్నట్టు వుంటాయా లేక మూషికాన్ని ఎలుక అనేలా వుంటాయా అనేది ముఖ్యం. ఎందుకంటే బడి పిల్లల పాఠ్యాంశాలే వారికి అర్థమయ్యే తెలుగులో కాక కఠినమైన సంస్కృతాంధ్రంలో వుంటున్నాయి. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే నోటీసుల అనువాదాలు సైతం వారికి అర్థం కాని విచిత్రమైన తెలుగులో తర్జుమా అవుతున్నాయి. ఇటువంటి దుర్గతి సుప్రీంకోర్టు తీర్పుల అనువాదాలకు పట్టకూడదు. రాజ్యాంగానికే ప్రజలకు తెలిసే సరళ భాషల్లో అనువాదం అలభ్యంగా వుంది. ఆ సెక్షన్లు, సబ్ సెక్షన్లను ప్రజలకు అర్థమయ్యేలా అనువదించాలంటే చాలా శ్రమపడాలి. ఆంగ్లంలో వున్న తిరుగుడు అన్వయాలు ప్రాంతీయ భాషల్లోకి రావాలంటే మాటలు కాదు. సంక్లిష్ట వాక్యాలను చిన్న చిన్న, అలతి అలతి పొట్టి వాక్యాల్లో విడగొట్టి ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తేగాని పరిమితంగా చదువుకొనే దేశ మెజారిటీ ప్రజలకు అర్థం కావు. అందుచేత మొక్కుబడి అనువాదాల వల్ల ప్రయోజనం శూన్యం.

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ నెల 2 తేదీన ఢిల్లీ హైకోర్టులో ఆన్‌లైన్ ఇ ఇన్‌స్పెక్షన్ సాఫ్ట్‌వేర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ న్యాయావతారంలోని ఆంగ్లాన్ని తెలుసుకోడం 99.9 % మందికి సంపూర్ణంగా సాధ్యం కాదని అన్నారు. అందుచేత తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదింపజేయడమే శరణ్యమని అభిప్రాయపడ్డారు. ఇందులో అణువంత కూడా అసత్యం లేదు. సాధారణ ప్రజల చెంతకు చేరాలన్న సుప్రీంకోర్టు అభీష్టాన్ని తప్పనిసరిగా హర్షించాలి. కాని ఈ ఒక్క చర్యతోనే దేశంలో న్యాయం కింది స్థాయి జనం వరకు చేరడం సాధ్యం కాదు. తీర్పులు సత్వరమే వెలువడడం ఒక్కటే న్యాయ వ్యవస్థకు సార్థకతను తీసుకు వస్తుంది. వాటిని ప్రాంతీయ భాషల్లోకి అనువదించడమనేది అందులో ఒక భాగం మాత్రమే. ప్రజాస్వామిక న్యాయ వ్యవస్థలో అపెల్లేట్ న్యాయానికి విశేష ప్రాముఖ్యం వున్నది.

రాజ్యాంగ విహితంగా, చట్టప్రకారం వివాదాలను పరిష్కరించేటప్పుడు ఏ దశలోనైనా పొరపాట్లు జరిగితే దానిని సరిదిద్ది ఒక్క నిర్దోషికైనా శిక్ష పడకుండా చూడడానికి అప్పీళ్ళ విధానం తోడ్పడుతున్నది. చివరికి ఉన్నత న్యాయస్థానాల్లో కూడా ఏక న్యాయమూర్తి, ఇద్దరు, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాలు ఆపైన మరింత విస్తృతమైన రాజ్యాంగ ధర్మాసనాలు, వాటి తీర్పులపై కూడా పునః పరిశీలించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసుకొనే అవకాశాలు వుంటాయి. ఈ క్రమంలో లిటిగెంట్స్ ప్రవేశించి పదేపదే వాయిదాలు కోరడం ద్వారా న్యాయాన్ని వీలైనంత ఆలస్యం చేయడం తద్వారా వారు విశేషంగా లాభపడడం జరుగుతున్నది. దీనిని కూడా తొలగిస్తే గాని సత్వర న్యాయమనే కల నెరవేరదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News