Thursday, January 23, 2025

విడాకుల జారీ వ్యాజ్యంపై 1న సుప్రీం తీర్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కుటుంబ న్యాయస్థానాలకు నివేదించకుండానే విడాకుల మంజూరీ అంశంపై సుప్రీంకోర్టు మే 1వ తేదీన (సోమవారం) తీర్పు వెలువరించనుంది. పరస్పరం ఇష్టపడి తమ పెళ్లిని రద్దు చేసుకుని విడాకులు కోరే వారి విషయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని విస్తృత అధికారాలను వినియోగించుకునే క్రమంలో పాటించబోయే నిబంధనల గురించి తీర్పు వెలువరిస్తుందని వెల్లడైంది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ విషయంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంపై తన తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. వివాహబంధానికి సంబంధించి చట్టాలకు అనుగుణంగా మార్పులు అంత తేలిక కాదని, మార్పులు చేర్పులకు కొంత సమయం పడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. భారతదేశపు పద్ధతులు సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు అనుకోని దశలో తలెత్తే విడాకుల విషయాలలో కుటుంబాలదే కీలక పాత్ర అవుతుంది.

విడాకులకు సంబంధించి పలు దశలలో కీలక విషయాలను లెక్కలోకి తీసుకోవల్సి ఉంటుంది. కుటుంబాలకు, ఫ్యామిలీకోర్టులకు విడాకుల మంజూరీ విషయాన్ని తెలియచేయాల్సి ఉంటుందా? లేదా ? విడాకులకు దరఖాస్తులు చేసుకున్న వారు కాలం గడుస్తున్న కొద్ది తిరిగి మనసు మార్చుకునే వీలుంటుందా? వంటి పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. వీటన్నింటికి సంబంధించి పూర్తిస్థాయిలో విధివిధానాలతో మే 1న తీర్పు వెలువరించే అవకాశం ఉందని వెల్లడైంది. కొన్ని సందర్భాలలో దంపతులు పలు కారణాలతో వేర్వేరుగా ఉంటూ వస్తుంటారు. కానీ వీరు విడాకుల కోసం దరఖాస్తులు చేసుకోవడం వంటి చర్యలకు దిగరు. ఇటువంటి విడి దంపతుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది అనేది కూడా సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News