Thursday, January 23, 2025

సిఎం రేవంత్‌ రెడ్డికి సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఓటుకు నోటు కేసులో ఎదురుదెబ్బ!
నాలుగు వారాల్లో సమాధానానికి ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత జగదీష్ రెడ్డి సుప్రీంలో ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మోహతా బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఇతర ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ సిఎంగా బాధ్యతలు చేపట్టి 60 రోజులు పూర్తైంది.

ఈ క్రమంలో ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం, సుప్రీం నుంచి నోటీసులు రావడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నోటీసులకు రేవంత్, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి రెస్సాన్స్ ఇస్తుందనేది కీలకంగా మారింది. ప్రస్తుతం హోంశాఖ కూడా రేవంత్ దగ్గరే ఉంది. త్వరలో ఓటుకు నోటు కేసుపై ట్రయల్ కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సిఎం, హోంమంత్రిగా రేవంత్ ఉండటంతో ఈ కేసులో విచారణపై ప్రభావం చూపే అవకాశముందని సుప్రీం దృష్టికి జగదీష్ రెడ్డి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. విచారణపై ప్రభావం చూపిస్తే తాము చూస్తూ ఎలా ఉంటామని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిపై ఇప్పటివరకు 88 కేసులు నమోదయ్యాయని, ఓటుకు నోటు కేసులో ట్రయల్‌ను నిలిపివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తన పిటిషన్‌లో జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులకు రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు చేసిన పోలీస్ అధికారులను నగ్నంగా పరేడ్ చేస్తానని రేవంత్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా సుప్రీంకు జగదీష్ రెడ్డి అందించారు. రేవంత్ సిఎంగా ఉండటంతో విచారణను ప్రభావితం చేసే అవకాశముందని, పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు కేసును బదిలీ చేయాలని కోరారు. జగదీష్ రెడ్డితో పాటు కల్వకుంట్ల సంజయ్, మహహ్మద్ అలీ, సత్యవతి రాధోడ్ కూడా పిటిషన్ దాఖలు చేశారు.

వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. రేవంత్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసు రేవంత్‌కు చిక్కులు తెచ్చి పెడుతుందేమోనని హస్తం పార్టీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. కాగా, తెలంగాణ సిఎంగా కెసిఆర్ ఉన్న సమయంలో 2015లో రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు నమోదైంది. ఎమ్మెల్యే కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధికి ఓటు వేయాలంటూ ఎంఎల్‌సి స్టీఫెన్‌సన్‌కు రేవంత్ డబ్బులు ఆఫర్ చేశారు. అప్పుడు రేవంత్ టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. స్టీఫెన్‌సన్ ఇంటికెళ్లి రూ.50 లక్షలు డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో కొన్ని రోజుల పాటు రేవంత్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News